గ‌న్నవ‌రం.. గుంభ‌నం-విజ‌యం ఎవ‌రిది?

-

ఎన్నిక‌ల‌కు ముందు ఆ నియోజ‌క‌వ‌ర్గం గ‌రం గ‌రం. ఇక్కడ ఓటింగ్ హోరా హోరీగా జ‌రిగింది. పైగా.. భిన్నమైన పార్టీల నుంచి వ‌చ్చి.. అంతే భిన్నమైన పార్టీల త‌ర‌ఫున ఇద్దరు నాయ‌కులు త‌ల‌ప‌డ్డారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం మ‌రింత కాక‌రేపింది. అదే ఉమ్మడి కృష్ణాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం. 2019లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, అదేసంవ‌త్స‌రం టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని వంశీలు.. 2024లో మాత్రం పార్టీలు మారి.. ప‌ర‌స్పరం మ‌రోసారి.. ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడుకున్నారు.

ప్రచారం నుంచి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా.. అత్యంత ఉద్రిక్త ప‌రిస్థితులు క‌నిపించిన గ‌న్నవ‌రం లో పోలింగ్ కూడా అంతే జోరుగా జ‌రిగింది. అయితే.. పోలింగ్ అనంత‌రం ప‌రిణామాల‌కు, పోలింగ్‌కు ముందున్న ప‌రిస్థితుల‌కు ఎలాంటి సంబంధం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. పోలింగ్ ముందు.. యార్ల‌గడ్డ విజ‌యం ఖాయ‌మ‌ని పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగింది. ఇదేస‌మ‌యంలో వంశీదే ఈ సీట‌ని వైసీపీ నాయ‌కుల కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతేకాదు.. ఇరు ప‌క్షాల్లోనూ పోలింగ్‌కు ముందే.. పందేలు కూడా క‌ట్టుకున్న ప‌రిస్థితి క‌నిపించింది.

 

ఇక‌, ఎన్నిక‌ల వేళ‌.. ఇద్దరు నాయ‌కుల కూడా ప‌ర‌స్పర అంగీకారం కుదిరిన‌ట్టుగా.. డ‌బ్బులు పంపిణీ చేప‌ట్టార‌న్న ప్రచారం కూడా ఉంది. ఇంత హోరా హోరీగా జ‌రిగిన గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఎటు చూసినా.. సైలెంట్ క‌నిపిస్తోంది. ఏ పార్టీ నాయ‌కులు కూడా.. నోరు విప్పడం లేదు. మా నాయ‌కుడు గెలుస్తాడ‌ని.. లేదు మా నాయ‌కుడిదే విజ‌య‌మ‌ని ఎన్నిక‌ల‌కు ముందు ఘంటా ప‌థంగా చెప్పిన నేత‌లు ఎవ‌రూ కూడా ఇప్పుడు క‌నిపించ‌డం లేదు.

గ‌న్నవ‌రంలో ఎందుకు ఇంత సైలెంట్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికి కార‌ణం.. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జ‌ర‌గ‌డం అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో గ్రామీణ ఓటు బ్యాంకు ఎటు ప‌డింద‌నే విష‌యంలో ఇద్ద‌రు నేత‌లు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు.. టీడీపీకే వేశార‌ని కొంద‌రు అంటే.. కాదు.. గ్రామీణ ఓటు బ్యాంకు నిక‌రంగా వైసీపీ ప‌క్షానే ఉంద‌ని చెబుతున్నారు. దీంతో గ‌న్నవరం ప‌రిస్థితి గుంభ‌నంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news