తెలంగాణలో కేసిఆర్ సర్కార్, గవర్నర్‌ల మధ్య అంతర యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని కీలక బిల్లుల విషయంలో సర్కార్, గవర్నర్ మధ్య వార్ నడుస్తుంది. ఇప్పటికే గవర్నర్ తమిళిసై..రాజకీయ నాయకురాలుగా మాదిరిగా ప్రవరిస్తున్నారని, బిజేపి పక్షాన ఆమె ఉన్నారని బిఆర్‌ఎస్ మండిపడుతుంది. అయితే ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపడం, బిల్లుల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసే అధికారం గవర్నర్‌కు ఉందనే వాదన వినబడుతుంది.
ఇదే క్రమంలో తాజాగా కేబినెట్..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. అయితే ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఆర్ధిక పరమైన అంశాలతో కూడిన బిల్లు కాబట్టి దీని ఆమోదానికి కాస్త టైమ్ కావాలని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బిల్లు పెండింగ్ లో పడటంతో బిఆర్‌ఎస్ తమదైన శైలిలో ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుకు బంద్‌కు పిలుపునిచ్చింది. గవర్నర్ వైఖరికి నిరసనగా ప్రతి డిపోలో ఆర్టీసీలు నిలిచిపోయాయి. సడన్ బంద్‌తో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
అయితే గవర్నర్ బిల్లుని పెండింగ్ లో పెట్టడం వల్లే ఇదంతా జరుగుతుందని బిఆర్‌ఎస్ రాజకీయం మొదలుపెట్టిందని చెప్పవచ్చు. ఆమోదిస్తే సంబరాలు, లేదంటే నిరసనలు అన్నట్లు బిఆర్‌ఎస్ ప్రిపేర్ అయి ఉంది. ఒకవేళ ఆమోదిస్తే..ఆ బిల్లు తెచ్చిన ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుంది. అప్పుడు ఆర్టీసీ కార్మికులు బిఆర్‌ఎస్ వైపు ఉంటారు.
ఒకవేళ బిల్లుకు ఆమోదం తెలపకపోతే గవర్నర్ కావాలని బిల్లుని ఆపారని చెప్పి రాజకీయం గా లబ్ది పొందే ఛాన్స్ ఉంది. ఎటు చూసుకున్న బిఆర్‌ఎస్‌కే బెనిఫిట్. మరి ఈ బిల్లు విషయంలో గవర్నర్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.