హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఆయన ప్లాన్ వేస్తే ప్రత్యర్థులు గల్లంతు కావాల్సిందే. ఆయనకు ఏదైనా పని ఇస్తే దాన్ని పూర్తి చేసే వరకు ఆయన రెస్ట్ తీసుకోరు. అందుకే ఎన్నికల వ్యూహాలకు ఎక్కువగా హరీశ్ రావుకే అప్పగిస్తుంటారు సీఎం కేసీఆర్. కానీ గత ప్రభుత్వంలో ఉన్న ప్రాముఖ్యత ఇప్పటి ప్రభుత్వంలో హరీశ్‌రావుకు ఇచ్చిన ప్రాముఖ్యత ప్రస్తుత ప్రభుత్వంలో ఇవ్వట్లేదనే విమర్శలు ఉన్నాయి.
అయితే ఈటల రాజేందర్‌ను ఎప్పుడైతే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారో అప్పటి నుంచి కేసీఆర్ హరీశ్‌రావుపై దృష్టి పెట్టారు. ఆయన లాంటి నాయకుడు తనకు ఎప్పుడూ అవసరమే అని గుర్తించి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ హరీశ్‌రావుకు ఎక్కువ అవమానాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీలో కార్యకర్తలు ఆందోళన చెందకుండా ఉండేందుకు, ఉద్యమకారులకు టీఆర్ ఎస్‌లో గౌరవం లేదన్న విమర్శలకు ఒకే దెబ్బతో చెక్ పెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే ఆయనకు మళ్లీ ప్రభుత్వంలో ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హరీశ్ రావును కొవిడ్ కంట్రోల్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అలాగే కేసీఆర్ ఆస్పత్రుల పరిశీలనకు వెళ్లినప్పుడు హరీశ్‌రావును కావాలనే వెంటపెట్టుకెళ్లారు. ఇక నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆస్పత్రుల స్టడీకి వేసిన కేబినెట్ సబ్ కమిటీకి హరీశ్‌రావును చైర్మన్‌గా నియమించారు.