మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మానటల యుద్ధం హద్దులు దాటి బూతులు తిట్టుకునే స్థాయికి దిగజారింది. మంత్రి అయ్యుండి స్థాయి మరిచి వాడిన పదజాలం సిగ్గు చేటు. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లు సాగుతుంది. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వారే హీరో అన్నంతగా రెచ్చిపోతున్నారు. మైనంపల్లి ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే కార్మిక శాఖ మంత్రి ఇంతలా రెచ్చిపోయి ఉండవచ్చు. కాగా రేవంత్ రెడ్డి తన దీక్ష సందర్భంగా చేసిన ఆరోపణలకు మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక మీడియా ముందు రెచ్చిపోయి మరీ తిట్లు పురాణం ఎత్తుకున్నారు. రేవంత్‌ను ఎవరూ ఊహించని రీతిలో తిడుతూ తన ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అలాగే రేవంత్ కూడా తన టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలిని సవాల్ విసిరారు.
అయితే ఈ విధంగా సవాల్ విసిరే క్రమంలో ఏకంగా తొడలు కొడుతూ డైలాగులు విసరుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. గతంలో ఎవ్వరు కూడా ఈ విధంగా మీడియా ముందు తొడలు కొట్టలేదనే చెప్పాలి. ఇక మల్లారెడ్డి తిట్ల పురాణం అయితే గతంలో ఎవరూ కూడా మాట్లాడలేదని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటికి కౌంటర్ గా రేవంత్ నిన్న మీడియా ముందుకు వచ్చి కొన్ని భూముల పత్రాలను, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చిన పర్మిషన్ కూడా ఫేక్ అంటూ కొన్ని పత్రాలను తీసుకువచ్చి చూపించారు.
ఇక కౌంటర్ వెయాల్సిన వంతు మల్లారెడ్డిది కాగా.. ప్రెస్‌మీట్ పెట్టి ఇంకా ఏ రీతిలో బూతులు తిడతారో అనుకుంటున్న జనాలకు షాకిస్తూ మల్లన్న ఎంతో పద్దతిగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఈ సారి ఆయన మాటల్లో ఎంతో మార్పు కనిపిస్తోంది. మొన్న కనిపించిన ఆవేశంలో పావువంతు కూడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఎంతో అమాయకంగా ఎంతో ఆవేదనతో మాట్లాడారు. ఆయన మాటల్లో ఒకింత బాధ, ఒకింత భయం స్పష్టంగా కనిపిస్తోందని విలేకరులు చర్చించుకుంటున్నారు. అయితే ఆయనలో ఎందుకింత మార్పు..
టీఆర్ఎస్ అధిష్ఠానం మందలించిందా లేక , రేవంత్ రెడ్డి సాక్ష్యాదారాలు, పత్రాలతో మీడియా ముందుకు రావడమేనా అని అంతా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా రేవంత్ ఎఫెక్ట్ మల్లారెడ్డి మీద బాగానే పడినట్టు కనిపిస్తోంది.