ఓట్ల వేట: ఏపీలో ముదిరిన పోలిటికల్ ఫైట్..!

ఏపీలో అప్పుడే ఓట్ల వేట మొదలైపోయింది..ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలతో ప్రధాన పార్టీల అధినేతలు, నేతలు ప్రజల్లోనే ఉంటున్నారు. ఎవరికి వారు ప్రజలకు మంచి చేస్తున్నట్లు కనిపించి..ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేలని గడపగడపకు పంపించి..జగన్ భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు.  ఆ సభల్లో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వమే ప్రజలకు మంచి చేసిందని, తమ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కానీ చంద్రబాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు.

ఇక తాజాగా మదనపల్లె సభలో జగన్ అదే తరహాలో మాట్లాడారు. తాను ప్రజలకు మంచి చేస్తుంటే..బాబు, పవన్, టీడీపీ మీడియా అడ్డుకోవాలని చూస్తుందని, తనకు ప్రజలే అండగా ఉండాలని కోరారు. అంటే తన ప్రభుత్వంతో అంతా మంచే జరుగుతుందని, కానీ చంద్రబాబు అడ్డుకుంటున్నారని, అటు తనకు బాబుకు మాదిరిగా మీడియా సపోర్ట్ లేదని అంటున్నారు. ఇక జగన్‌కు అనుకూలంగా మీడియా లేదంటే జనం నమ్ముతారో లేదో చూడాలి.

ఇటు వస్తే చంద్రబాబు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. అక్కడ రోడ్ షోలు నిర్వహించారు. యథావిధిగానే..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అందరిపై కేసులు పెడుతుందని, ప్రజలని దోచుకుంటున్నారని..పది రూపాయిలు ఇచ్చి, వంద రూపాయిలు దోచేస్తున్నారని, వైసీపీ నేతలు ఇసుక, ఇళ్ల స్థలాల్లో దోపిడి చేశారని, భూకబ్జాలు చేస్తున్నారని, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక తాను వస్తే రాష్ట్రాన్ని గాడిలో పెడతానని, అభివృద్ధి చేస్తానని, ఇంతకంటే మెరుగ్గా సంక్షేమం అందిస్తానని అంటున్నారు.

అంటే అటు జగన్ అయినా, ఇటు చంద్రబాబు అయినా ఓట్ల కోసం ఇప్పటినుంచే నానా తిప్పలు పడుతున్నారని అర్ధమవుతుంది. ప్రజలని మెప్పించడానికి తెగ కష్టపడుతున్నారు. ఒకరిపై ఒకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. మరి వీరిలో ప్రజలు ఎవరిని నమ్ముతారో చూడాలి.