తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ huzurabad ఉపఎన్నిక ఓ సంచలనంగా మారేలా కనిపిస్తోంది. ఈ ఉపపోరుని అన్నీ రాజకీయ పార్టీలు తమ పరువుకు సంబంధించిన విషయంగా మార్చుకున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని వదిలేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు అనివార్యమైంది. ఈ పోరులో సత్తా చాటి హుజూరాబాద్ తన కంచుకోట అని నిరూపించాలని రాజేందర్ చూస్తున్నారు. అటు ఈటలని ఓడించి హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. తమకున్న బలాన్ని చూపించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అయితే ఎంత కాదు అనుకున్న ఇక్కడ టీఆర్ఎస్-ఈటల మధ్యే అసలైన పోరు జరగనుందని తెలుస్తోంది.
ఆ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు హుజూరాబాద్ బరిలో తలపడనున్నాయి. కొత్తగా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సైతం హుజూరాబాద్ పోరు ఏమి తన సామర్ధ్యానికి పరీక్ష కాదని తేల్చి చెప్పేశారు. దీంతో ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ జరుగుతుంది. ఇక ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న హుజూరాబాద్‌కు సంబంధించి ఓ ఆసక్తికర సర్వేని బయటపెట్టారు.
ఈ పోరులో ఈటలకే లీడ్ ఉందని చెబుతున్నారు. హుజూరాబాద్‌లో 55 శాతం ప్రజలు ఈటల వైపు ఉన్నారని అంటున్నారు. అలాగే టీఆర్ఎస్‌కు 33 శాతం ప్రజల మద్ధతు ఉందని, కాంగ్రెస్‌కు 12 శాతం మద్ధతు ఉందని చెబుతున్నారు. అయితే మల్లన్న ఏ సర్వే ఆధారంగా ఇలా చెప్పారనే విషయం క్లారిటీ లేదు. మరి చూడాలి హుజూరాబాద్ బరిలో ఎవరికి లీడింగ్ ఉంటుందో? మల్లన్న చెప్పే సర్వే నిజం అవుతుందో?