తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఇక్కడే మకాం వేసి, పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. తమ ప్రత్యర్ధులని చిత్తు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరుపున ఈటల రాజేందర్ ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే, నియోజకవర్గంలో పాదయాత్ర పేరుతో జనాలని కలుస్తూ, తనని గెలిపించాలని కోరుతున్నారు.
అటు అధికార టీఆర్ఎస్ సైతం దూకుడుగా ముందుకెళుతుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్ని గెలిపించాలని తిరుగుతున్నారు. అలాగే వేల కోట్లతో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం ఇప్పుడుప్పుడే హుజూరాబాద్‌లో ప్రచారం మొదలుపెడుతుంది. అయితే కాంగ్రెస్ ఉన్నా సరే ఇక్కడ ప్రధాన పోరు టీఆర్ఎస్-బీజేపీల మధ్యే జరగనుందని తెలుస్తోంది. ఈ విధంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో ఇంటిలిజెన్స్ వర్గాలకు అంతు చిక్కని తీర్పు వస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించినే ఇంటిలిజెన్స్ వర్గాలకే అంతు పట్టని తీర్పు అంటే, ఈటలకే అనుకూలంగా ఫలితం వస్తుందని గోనె పరోక్షంగా చెబుతున్నట్లు కనిపిస్తోంది. అయితే హుజూరాబాద్‌లో తన మద్ధతు ఈటలకే అని గోనె ప్రకటించారు.
హుజురాబాద్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందినదని, అలాంటి చోట ఒక బీసీ నాయకుడు ఆరు సార్లు పోటీ చేసి గెలిచాడంటే ఆలోచించాలని అంటున్నారు. దళితబంధు వల్ల హుజూరాబాద్‌లో టీఆర్ఎస్కు పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మొత్తానికైతే హుజూరాబాద్‌లో ఈటలకే గెలిచే ఛాన్స్ ఉందని గోనె అంటున్నారు.