హుజూరాబాద్ వార్: ఈటలకే ఎడ్జ్ ఉందా?

తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు హోరాహోరీగా జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్(huzurabad) బరిలో సత్తా చాటాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల, హుజూరాబాద్ తన అడ్డా అని మరోసారి రుజువు చేయాలని అనుకుంటున్నారు.

హుజూరాబాద్/huzurabad
హుజూరాబాద్/huzurabad

కానీ హుజూరాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టి గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు. అయితే ఇంతవరకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరు అనేది తేలలేదు. ఇప్పటికే పలువురు నాయకులు పేర్లు తెరపైకి వచ్చాయిగానీ కేసీఆర్ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.

తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణని, టీఆర్ఎస్‌లో చేర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. అయితే బీసీ వర్గంలో మంచి పట్టు ఉన్న రమణని హుజూరాబాద్ బరిలో నిలబెడతారని కథనాలు వస్తున్నాయి. పైగా రమణ సామాజికవర్గానికి చెందిన ఓట్లు హుజూరాబాద్‌లో బాగానే ఉన్నాయని అంటున్నారు. బీసీల్లో బలమైన ఈటలకు చెక్ పెట్టాలంటే, రమణనే కరెక్ట్ అని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే ఎవరు బరిలో ఉన్నా సరే హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దశాబ్దాల పాటు హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటలని ఓడించడం కష్టమని అంటున్నారు. ఇక ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నికపై జరుగుతున్న విశ్లేషణల్లో కూడా ఈటలకే కాస్త ఎడ్జ్ ఉందని తెలుస్తోంది.

హుజూరాబాద్ ప్రజలు కాస్త ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కానీ టీఆర్ఎస్ పెట్టే అభ్యర్ధి బట్టి, కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు బట్టి ఫలితాలు మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి హుజూరాబాద్ బరిలో ఏం జరుగుతుందో?