వచ్చే ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఎలా ఉన్నా కూడా కేసీఆర్ మాత్రం తన గెలుపు ఖాయం అనే అంటున్నారు.కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవాళ అస్సలు కోలుకోని స్థితిలో ఉన్నాయని, వాటికిక ప్రత్యామ్నాయ రాజకీయం నడపడం చేతగాదని కూడా కేసీఆర్ ఓ సందర్భంలో అన్నారు.దీంతో కేసీఆర్ ఒక్కరే తనవంతుగా కృషి చేసి తెలంగాణ వాకిట పార్టీని నిలబెట్టడమే కాకుండా,ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మలిచి ప్రజల మన్ననలు అందుకునేలా చేయగలిగారు.అందుకే కేసీఆర్ ఒన్ మేన్ ఆర్మీ.
తెలంగాణలో కాంగ్రెస్ కు అస్సలు ఉనికే లేకుండా పోయి ఏడున్నరేళ్లు దాటి పోయింది.ఉత్తమ్ తరువాత రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నాక కూడా ఆ పార్టీ గమనంలో ఎటువంటి మార్పులూ లేవు.ఇకపై ఉండవు కూడా! అందుకే పైకి గట్టిగా మాట్లాడినా చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ఇవాళ కేసీఆర్ అభిమానులుగా మారిపోతున్నారు.వీలయితే ఆ పార్టీలో చేరిపోతే బాగుండు అని కూడా అనుకుంటున్నారు.ఇమేజ్ ఉన్న కోమటిరెడ్డి లాంటి లీడర్లు కొంత డైలమాలో ఉన్నా ఎన్నికల నాటికి వారు కూడా అటు బీజేపీలో కానీ ఇటు టీఆర్ఎస్ లో కానీ చేరి తమ సత్తా చాటుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
రేవంత్ తో సొంత సామాజిక వర్గం నేతలే విభేదిస్తున్నారు కనుక ఇక కాంగ్రెస్ ఎలా నిలదొక్కుకోగలదని ఇంకొందరు పార్టీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.ఉద్యమాల నిర్మాణంలోనూ, ప్రజా వ్యతిరేకత కూడగట్టడంలోనూ రేవంత్ ఇవాళ తీవ్ర స్థాయిలో విఫలం అవుతున్నారు అన్న మాట వాస్తవం.అందుకే కాంగ్రెస్ పార్టీ మునుపటి ప్రాభవాన్ని అందుకోలేకపోతోంది. జగ్గారెడ్డి లాంటి సీనియర్లు,గీతారెడ్డి లాంటి సీనియర్లు వందల సంఖ్యలో ఉన్నా కూడా వాళ్లంతా పార్టీ వైభవంను కాపాడేందుకు, వీలుంటే పెంచేందుకు,గత కాల విజయాలు తిరిగి పొందేందుకు కారణం కాలేకపోతున్నారు.ఇదే దశలో జగ్గారెడ్డి లాంటి వారు రేవంత్ తో వేగలేక పార్టీని వీడిపోయేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.
ఇక బీజేపీ విషయానికే వస్తే అక్కడ కూడా అంతఃకలహాలు ఉన్నాయి.కిషన్ రెడ్డి లాంటి సీనియర్లు ఢిల్లీ రాజకీయాల్లో నిలదొక్కుకుని హాయిగా పదవులు అనుభవిస్తుంటే,క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్ధితి మాత్రం ఇందుకు భిన్నంగానే ఉంది.కొన్నిసార్లు
కిషన్ రెడ్డి లాంటి వారు పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేయడం లేదన్న వాదన కూడా ఉంది.రాజా సింగ్ కానీ రఘు నందన్ కానీ ఈటెల కానీ మొన్నటి వేళ గెలిచారంటే అందుకు బీజేపీ కాదని కేవలం వారి వ్యక్తిగత ఇమేజ్ ఒక్కటే ప్రధాన కారణం అని ఎప్పుడో తేలిపోయింది.తెలంగాణ బీజేపీ విభాగానికి అధ్యక్ష హోదాలో బండి సంజయ్ ఉన్నా కూడా ఫలితం లేదు.
ఇలాంటి దశలో కేసీఆర్ కు ప్రశాంత్ కిశోర్ జతగలిశారు.అంటే ఇకపై రాజకీయం మరింత మారనుంది.సానుభూతి రాజకీయ శక్తి ప్రబలనుంది.ఈ దశలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ కు అనుకూలంగా లేని శక్తులను తమవైపు తిప్పుకోవడం కూడా జరగని పని.అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచేది కేసీఆర్ అని ఇప్పటికే తేలిపోయింది.