రాజకీయాల్లో వలసలు అనేవి సహజమే. నాయకులు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి పార్టీలు మారిపోతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉండే నాయకులు..అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఎక్కడైనా ఇదే పరిస్తితి ఉంటుంది. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి కూడా ప్రతిపక్ష టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుతూనే వచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే చాలామంది టీడీపీ నేతలు..ఆ పార్టీలో చేరిపోయారు.
అలాగే నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీ వైపుకు వచ్చారు. అయితే గతేడాది నుంచి పెద్దగా వలసలు మాత్రం నడవటం లేదు. జంపింగులు ఆగిపోయాయి. మరి వలసలు ఆగిపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఒకవేళ వైసీపీలో ఫుల్‌గా నాయకులు ఉండటం వల్ల వలసలు ఆగాయో లేక టీడీపీ కూడా బలపడుతుందని నాయకుల జంపింగ్‌లు ఆగాయనేది మాత్రం క్లారిటీ లేదు.
కానీ వలసలకు కాస్త బ్రేక్ పడింది…అయితే టీడీపీ నేతలు ఇంకా తమతో టచ్‌లోనే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో ఉన్న ముఖ్య నేతలు జగన్‌కు టచ్‌లోకి వచ్చారని, త్వరలోనే కీలక నేతలు వైసీపీలో చేరతారని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. పలువురు టీడీపీ ముఖ్యనేతలు తమతో టచ్‌లో ఉన్నారని, వారితో సంప్రదింపులు జరుగుతున్నాయని, 2024 ఎన్నికలనాటికి టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
టీడీపీ ఖాళీ అవుతుందనే విషయం పక్కనబెడితే, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం వైసీపీకి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ కీలక నేతలు ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే గంటా శ్రీనివాసరావు లాంటి ముఖ్య నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. ఆయనతో పాటు పలువురు నేతలు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే టీడీపీ నుంచి ఇంకా జంపింగులు ఉంటాయని అర్ధమవుతుంది.