అక్క‌డ ఇక సైకిల్ ఇక తిర‌గ‌దా… పోయినోళ్లు పోగా.. ఉన్నోళ్లూ జంపింగే…!

-

అదేం చిత్ర‌మో కానీ.. ఖ‌చ్చితంగా ఏడాది కింద‌ట టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేసుకున్న ప్లాన్‌.. ఏడాది తిరిగే స‌రికి ప‌టాపంచ‌లైంది. ఆయ‌న మాట‌ల్లో చెప్పాలంటే.. “ఈ జిల్లాలో సైకిల్ తిర‌గ‌డం కాదు. ప‌రుగులు పెడుతుంది. ప్ర‌తి ఇంటిపైనా టీడీపీ జెండా ఎగురు తుంది. దీనికి ఎంతో స‌మ‌యం లేదు. మ‌రో నాలుగు నెల‌లు(అప్ప‌టికి). నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాలి. పార్టీని బ‌లోపేతం చేసేందుకు నేనేం చేయాలో అంతా చేస్తాను“ అన్నారు. ఇలా అన్న ప‌రిస్థితి క‌ట్ చేస్తే.. ఇప్పుడు పార్టీ జెండా ప‌ట్టుకునే కార్య‌క‌ర్త కూడా క‌నిపించ‌డం లేదు. ఆ జిల్లానే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌.

ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ఇక్క‌డ పూర్తిగా నాయ‌కులు జెండా మార్చేశారు. కీల‌క నాయ‌కులు ఆదినారాయ‌ణ‌రెడ్డి, ఎస్వీ స‌తీష్ రెడ్డి, సీఎం ర‌మేష్ వంటివారు పార్టీకి గుడ్ బై చెప్పారు. పోయిన వారంతా పార్టీని వాడేసుకున్నారు. కాబ‌ట్టి ఇప్పుడు ఉన్న‌వాళ్ల‌తో అయినా.. పార్టీని న‌డిపించాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, ఇప్పుడు అది కూడా క‌ష్ట‌మేన‌ని తెలిసిపోయింది. ప్రొద్దుటూరుకు చెందిన ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను స్థానిక ఎన్నికలకు దూరమని ప్రకటించి టీడీపీని వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా లోనైనట్లు తెలుస్తోంది.

ఆయ‌న కూడా త్వ‌ర‌లోనే సైకిల్ దిగుతార‌ని అంటున్నారు. వరదరాజుల రెడ్డి అనుచరవర్గం ఈ ఎన్నికల్లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడినా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ముక్తియార్‌ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత సుగవాసి పాలకొండ్రాయుడి వర్గం ఆ పార్టీపై గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే అంసతృప్తితో ఉంది. ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తన అనుచరులతో కలిసి టీడీపీని వీడనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

బద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అరకొరగా మిగిలి ఉన్న టీడీపీ నేతలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడం లేదు. కొందరు రెండో శ్రేణి నేతలు సైతం ఈ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సో.. క‌డ‌ప జిల్లాపై చంద్ర‌బాబు ఎన్ని ఆశ‌లు పెట్టుకున్నారో అవ‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news