తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది టిడిపి నేతలు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. బిఆర్‌ఎస్ పార్టీలో సగానికి సగం మంది టిడిపి నుంచి వచ్చిన వారే. ఇక 2014 ఎన్నికల తర్వాత చాలామంది నేతలు బిఆర్‌ఎస్ లో చేరారు. దాదాపు టిడిపి నేతలు బిఆర్‌ఎస్ లో చేరారు. అలా బిఆర్‌ఎస్ లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు.
అయితే కారు పార్టీలో ఉన్న మాజీ తమ్ముళ్ళు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? వారికి రాజకీయ పరిస్తితులు అనుకూలంగా ఉన్నాయా? అనేది ఒకసారి చూస్తే చాలామంది మాజీ తమ్ముళ్ళకు మళ్ళీ గెలుపుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా మంత్రులుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఇబ్బంది లేదని తెలుస్తోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి, సనత్‌నగర్‌లో తలసానికి రిస్క్ పెద్దగా కనిపించడం లేదు. ఇటు ఎమ్మెల్యేల విషయానికొస్తే జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ లో వివేకానందలకు ఇబ్బంది లేదని తెలుస్తోంది.
వీరంతా 2014లో టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వెళ్ళిన వారే. మళ్ళీ 2018లో గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో కూడా వారికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు కంటోన్మెంట్‌లో సాయన్న, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిలకు కాస్త అనుకూల వాతావరణం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్‌కు పరిస్తితి బాగానే ఉంది. పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కాస్త ఇబ్బంది ఉంది. ఇక 2018 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వెళ్ళిన సత్తుపల్లి ఎమ్మెల్యే వీరయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులకు సైతం ఈ సారి గెలవడం అంత సులువు కాదని తెలుస్తోంది.