ఏదైనా సమస్య తలెత్తినప్పుడు.. ప్రభుత్వ పరంగా ఇతరుల నుంచి ఎలాంటివిమర్శలూ రాకుండా కాచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలోని మంత్రులకు ఎంతైనా ఉంటుంది. తప్పు తమదైనా.. కాకపోయినా.. ఆ సమస్య నుంచి తప్పించుకునే ప్రభుత్వం తరఫున మంత్రులు కొంతైనా ప్రయత్నం చేయడం అనేది పరిపాటి. గతంలో ఐదేళ్లు చంద్రబాబు పాలించిన సమయంలో మంత్రులు అందరూ కూడా ఇలానే వ్యవహరించారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున అనేక పొరపాట్లు జరిగినా.. తప్పు తమ మీదకు రాకుండా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ కామెంట్లతో ముందు మంటపై తమదైన శైలిలో నీళ్లు చల్లేవారు. ప్రతిపక్షంపై తప్పును తోసేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగించారు.
విశాఖ విమానాశ్రయంలో 2017లో జగన్‌ను పోలీసులు నిలువరించినప్పుడు కానీ, తర్వాత ఆయన పాదయాత్ర సమయంలో అదే విమానాశ్రయంలో కోడికత్తి ఘటన జరిగినప్పుడు కానీ టీడీపీ మంత్రులు, నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి వాటి నుంచి తప్పుకొనే ప్రయత్నం చేశారు. ప్రజలను ఆలోచనలో పడేశారు. ప్రతిపక్షానిదే తప్పు అని చర్చించే స్థాయిలో వ్యవహరిం చారు. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఆ తరహా వ్యవస్థ కనిపించడం లేదు. జరుగుతున్న అంశాలపై వారు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే.. ప్రభుత్వమే పనిగట్టుకుని తప్పుచేస్తున్నట్టుగా అనిపించే భావన కళ్లకు కట్టలా వ్యవహరిస్తు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అది, రాజధాని అమరావతి ఆందోళనల అంశమైనా.. తాజాగా చంద్రబాబుకు విశాఖలో ఎదురైన చేదు అనుభవం అయినా వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించిన తీరు ప్రభుత్వాన్ని సమర్ధించేది కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేదిలా ఉందని అంటున్నారు పరిశీలకులు. హోం మంత్రి సుచరిత తాజాగా చంద్రబాబుకు విశాఖలో జరిగిన ఘటనపై మాట్టాడుతూ.. గతంలో జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టునుంచి తిప్పిపంపలేదా? అని అన్నారు. అంటే.. నాటి ఘటనకు ప్రతీకారంగా మేమే ఇలా చేశాం అని ఆమె ఒప్పుకొ న్నట్టే కదా! అంటున్నారు నెటిజన్లు. ఇక, మంత్రి అవంతి, మరో మంత్రి బొత్సల వ్యాఖ్యలు కూడా తప్పుపట్టేవిగానే ఉన్నాయి. విశాఖలో రాజధాని వద్దన్న చంద్రబాబు అక్కడకు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు.
మంత్రుల స్థాయిలో ఉన్నవారు గల్లీ స్థాయి నాయకుల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేదనేది వైసీపీ మద్దతు దారుల నుంచే వస్తున్న ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఎవరి భావాలు వారికి ఉంటాయి. వద్దన్న మాత్రాన విశాఖకు రానీయకుండా అడ్డుకుంటామనే భావనలో మంత్రులు మాట్లాడడం సరికాదని అంటున్నారు మేధావులు కూడా. ప్రభుత్వం తప్పు ఉందో లేదో.. అది వేరే విషయం.. కానీ, మంత్రులు మాట్లాడాల్సిన తీరు మాత్రం ఇది కాదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు విషయాలను పక్కదారి పట్టించి, మరింత వివాదం చేయకుండా వ్యవహరించాలని వైసీపీ సీనియర్ల నుంచి కూడా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి.