కొల్లాపూర్‌లో ట్విస్ట్‌లు: బీఆర్ఎస్‌కు జూపల్లి హ్యాండ్..ఛాన్స్ ఎవరికి?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బి‌ఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వీరు ప్రత్యర్ధులుగా తలబడ్డారు. జూపల్లి బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, బీరం కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. విజయం బీరంని వరించింది.

అయితే బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో బీరం కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి..బి‌ఆర్‌ఎస్ లో చేరిపోయారు. ఇక అప్పటినుంచి బీరం వర్సెస్ జూపల్లి అనే విధంగా బి‌ఆర్‌ఎస్ లో రచ్చ నడుస్తోంది. ఇద్దరు నేతల మధ్య పోరు జరుగుతుంది. అధికారం ఉండటంతో బీరం హవా నడుస్తుంది. అయినా సరే జూపల్లి తనదైన శైలిలో రజకీయం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో బి‌ఆర్‌ఎస్ అధిష్టానం…సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు అని ప్రకటించింది. పైగా బీరంకు బి‌ఆర్‌ఎస్ అధిష్టానం సపోర్ట్ చేస్తూ వస్తుంది.

దీంతో జూపల్లి వర్గం నిదానంగా పార్టీకి దూరమవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాను బిఆర్ఎస్ లో ఉన్నానో లేనో పార్టీ అధినాయకత్వానికి తెలియాలని, తనకు మెంబర్‌షిప్ పుస్తకాలు కూడా ఇవ్వలేదని, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరాచకాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రౌడీల్లాంటి కొందరు పోలీసులను తీసుకొచ్చి.. తన అనుచరులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారని,  కొల్లాపూర్ లో పోలీసుల అరాచకాలపై డీజీ దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఈ వ్యవహారాన్ని ప్రగతి భవన్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని, సాధించిన తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా అన్నది చూడాల్సిన సమయం అని జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిబట్టి చూస్తే జూపల్లి బి‌ఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నారా అనే డౌట్ వస్తుంది. పార్టీ వీడితే…మళ్ళీ ఏ పార్టీలో చేరతారో చూడాలి. ఏదేమైనా జూపల్లితో బి‌ఆర్‌ఎస్ పార్టీకి తిప్పలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news