ఏపీ శాసన మండలి రద్దు విషయం ఇప్పుడు కేంద్రం కోర్టులోకి చేరింది. అయితే, దీనిపై రాష్ట్ర ప్రబుత్వం ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. ఏపీ అసెంబ్లీ భారీ మెజారిటీతో మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇది కనీసం మూడు మాసాల్లో అయినా ఓకే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించిం ది. అయితే, తాజాగా ఈ విషయంపై కేంద్ర హోం శాఖ వర్గాలు లీకులు ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ విషయం లో కేంద్రం జోక్యం చేసుకునే సమయం లేదని, మండలి రద్దు ప్రతిపాదనపై మరోసారి ఆలోచించుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం మండలి కావాలని, వద్దని రెండు తీర్మానాలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మండలి విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అంటున్నారు. పైగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 169(2) ప్రకారం.. మండలి రద్దు చేయాలా? వద్దా? అనే విషయంలో పార్లమెంటుకు పూర్తి అధికారం ఉన్నదని అంటున్నారు. అంతేకాదు, గతంలో మండళ్లు ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో దీనిపై నియమించిన స్టాండింగ్ కమిటీ కూడా మండలి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సిఫారసు చేసింది.
దీనిపై మోడీ ప్రభుత్వం కసరత్తు చేసి, దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు మండళ్లు ఏర్పాటు చేసుకోవాలా? వద్దా? రద్దు చేయాలంటే ఏం చేయాలనే విషయాలను రూపొందించే అవకాశంపై దృష్టి పెట్టనుందని అంటున్నారు. దీనికి ఈ ఏడాది చివరిలో ఓ ప్రతిపాదన చేయాలని భావిస్తున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికిప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మండలి రద్దుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదని, ఈ ఏడాది చివరి నాటికి దీనిపై ఏదైనా నిర్ణయం వెలువడితే వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి ఇప్పట్లో ఊరట లభించే పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.