మంత్రిగా అవకాశం రావడమే అరుదు. అందునా చకోర పక్షుల్లా అధికారం కోసం ఎదురు చూసిన వందల మంది నాయకులు ఉన్న వైసీపీలో మంత్రి పదవిని అందిపుచ్చుకునే ఛాన్స్ దక్కడం మరీ అరుదు. అయితే.. ఇది అందని వరమో.. లేక అందిన వరమో తెలియదు కానీ.. కడప జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాకు జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే. దీనికి ముందు కొంత చెప్పుకోవాలి. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న క్రమంలో అంజాద్‌ను కర్నూలు, కడప, గుంటూరుకు చెందిన ముస్లిం సోదరులు కలిసారు. ఈ క్రమంలో తమ సాదక బాధలు చెప్పుకొన్నారు.
దీంతో కరిగిపోయిన బాషా (నిజంగానే ఆయన చాలా సున్నితమనే పేరుంది) మన నాయకుడు అధికారంలోకి రాగానే మీకు న్యాయం జరిగేలా చూస్తాను. మన వర్గానికి మేలు జరిగేలా చేస్తాను. దాదాపు మెజారిటీ పదవులు ఏదో ఒక రూపంలో దక్కేలా చూస్తాను. అందరికీ గుర్తింపు లభించేలా చేస్తాను. అని హామీల మీద హామీలిచ్చారు. నిజానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మైనార్టీలకు గుర్తింపు లేకపోవడం.. పదవుల విషయంలోనూ తమకు అన్యాయం చేశారనే వాదన బలంగా ఉండడంలో అందరూ జగన్‌పైనా.. అంతకుమించి తమ నాయకుడుగా పేరున్న అంజాద్‌పైనా ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే అంజాద్ బాషా.. వారికి హామీలు ఇచ్చారు. కట్ చేస్తే.. అంజాద్ గెలుపు గుర్రం ఎక్కారు. అంతేకాదు.. జగన్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. ఏడాదిన్నరపూర్తయింది. మరో 9 నెలల్లో ఆయన పదవి నుంచి దిగిపోతారన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. మరి ఆయన హామీలు నెరవేర్చారా? అనుకున్నట్టే మైనార్టీ వర్గాలకు పదవులు ఇప్పించుకున్నారా? అంటే.. ఎక్కడా ఒక్కటంటే.. ఒక్కటి కూడా ఇప్పించుకోలేక పోయారు అంతేకాదు.. నియోజకవర్గంలో మాత్రమే ఆయన పరిమితమయ్యారు. పేరుకే మంత్రిగా మిగిలిపోయారు. మొత్తం అంతా గడికోట శ్రీకాంత్‌రెడ్డి కనుసన్నల్లోనే కడప జిల్లా నడుస్తోంది. కాదంటే.. ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకుంటున్నారు.
చివరకు సొంత జిల్లాలో ముస్లింలకే ఆయన చిన్న పనులు కూడా చేసిపెట్టలేదట. దీంతో చిర్రెత్తు కొచ్చిన ముస్లింలు ఇదే విషయాన్ని అంజాద్ దగ్గర కక్కేశారు. దీంతో ఆయన మైనారిటీ నేతలకు అవకాశం ఇప్పించుకోలేక పోయానని.. ప్రస్తుతం ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియంది కాదు కదా ? అంటూ.. చేతులు ఎత్తేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమి చేయలేను.. అని అనేయడంతో ఇప్పుడు వీరంతా బాషా లాంటి మంత్రి మన వర్గానికి అవసరమా ? అని గుస్సా అవుతున్నారట.