తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతుండడంతో నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి Jagadish Reddy రాష్ట్ర విపక్షాలపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి … రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని తాము మొదటి నుంచే వ్యతిరేకిస్తూనే ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్లి స్టే తెచ్చామని, కేంద్ర ప్రభుత్వానికి దఫాదఫాలుగా సీఎం కేసీఆర్ లేఖలు రాశారని, కేంద్ర జలశక్తి మంత్రికి ఘాటైన లేఖ కూడా రాశామని గుర్తు చేసారు.
తెలంగాణను ఎండబెట్టడం మొదటి నుంచి ఆంధ్రా పాలకులకు అలవాటేనని, తెలంగాణకు ఎత్తి పోతల పథకాలే శరణ్యమని తెలిసినా సమైక్య పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. తెలంగాణ దోపిడీకి చంద్రబాబు ఒక్క అడుగు ముందుకేస్తే దివంగత నేత వైఎస్ వంద అడుగులు వేశారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ నేతలు ఎవ్వరూ వైఎస్ జల దోపిడీని అడ్డుకోలేకపోయారని అన్నారు. తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంతపాడుతున్నాయని విమర్శించారు. వైఎస్ నీళ్ల దొంగ జగన్ అంతకు మించిన గజ దొంగ అనడానికి ప్రతిపక్షాలకు నోళ్లు ఎందుకు రావడం లేదు ? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు.
కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఉపయోగం లేదని కాంగ్రెస్ నేతలు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారన్న జగదీశ్ రెడ్డి… రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి మాటలతో సాధ్యమా ? అని ప్రశ్నించారు. వైఎస్ తరహాలోనే జగన్ కు తెలంగాణ వ్యతిరేక ధోరణి ఉందని అన్నారు. ఒక్క నీటి చుక్కను కూడా అన్యాయంగా ఏపీకి తరలించడాన్ని ఒప్పుకోమని స్పష్టం చేసారు. కేసీఆర్ చేసిన సూచనలు పాటించి ఉంటే ఏ వివాదాలు లేకుండా కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలు వాడుకునే వీలుండేదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ ఎత్తి పోతల పనులు ఆపి , జీవో ఉపసంహరించుకుంటే జగన్ తో చర్చలకు తాము సిద్ధమని అన్నారు.