ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జరిగింది.మేమంతా సిద్ధం బస్ యాత్రతో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.యాత్రలో ఉన్న సీఎంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారు. పూలతో పాటుగా రాళ్లు రావడంతో ముఖ్యమంత్రి కనుబొమ్మపై గాయమైంది. దీంతో అక్కడే వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. కాసేపటి తరువాత మళ్ళీ యాత్రను ప్రారంభించారు సీఎం. అయితే ఈ దాడిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం చెందుతున్నారు.దీని వెనకాల ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ కి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 14వ రోజు గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయింది. నంబూరు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర.. కాజా టోల్‌గేట్, ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ మీదుగా.. సీకే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. అక్కడ చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. మంగళగిరి విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో వైసీపీ చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశం ఇస్తే.. డబ్బుతో గెలవాలని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని ఆరోపించారు. ఇక.. చేనేత కార్మికులతో ముఖాముఖి తర్వాత జగన్ బస్సు యాత్ర కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్‌కు చేరుకుంది. భోజన విరామం తర్వాత తాడేపల్లి బైపాస్ నుంచి వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో.. విజయవాడ వారధి దగ్గర ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యకర్తలు, నేతలు.. సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. విజయవాడలో జగన్ బస్సుయాత్రలో జనం పోటెత్తారు. ఏ సెంటర్‌లో చూసినా.. ఏ రోడ్డులో చూసినా.. జగన్ బస్సుయాత్రకు జనం నీరాజనం పట్టారు. విజయవాడ నగరంలోని రోడ్లన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. వేలాది మంది కార్యకర్తలు.. జగన్ బస్సుకు ఇరువైపులా పరుగులు తీస్తూ.. జై జగన్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు.
ఇంత వైభవంగా జరుగుతున్న యాత్రకు ఎలాగైనా బ్రేక్ వెయ్యలని కుట్రలు చేసిన చంద్రబాబు తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. కొందరు టీడీపీ అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆగంతకుడు రాయి విసిరాడు. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసిరినట్టు రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. వైద్యులు జగన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తర్వాత యధావిధిగా బస్సు యాత్ర కొనసాగింది.కాగా ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది.ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.దాడి సమాచారం అందుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.ప్రధాని మోదీ సహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఈ ఘటనపై స్పందించారు. జనాదరణ కలిగిన నేతపై ఇలా దాడులు చేయడం తగదని పేర్కొన్నారు.