విపక్షాల మత రాజకీయాల పై జగన్ సరికొత్త ప్యూహం

-

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మతం ప్రధానాంశంగా మారింది. వైఎస్ జగన్ క్రైస్తవుడు కావడంతో రాష్ట్రంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందనే విషయాన్ని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. అందుకే దీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా జగన్ సర్కార్ సరికొత్త ప్యూహానికి తెర తీసినట్లు తెలుస్తుంది.

రామతీర్ధం ఘటనను అవకాశంగా తీసుకుని విపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న మత దాడి ముందు వైసీపీ వివరణలు సరిపోవటం లేదని భావిస్తున్న ప్రభుత్వం వ్యూహాత్మక ఎత్తుగడకు సిద్ధమవుతోంది. చంద్రబాబు హయాంలో ధ్వంసం చేసిన 40గుళ్లను పునరుద్ధరించటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వీటికి శంఖుస్థాపన చేయనున్నారు.

చంద్రబాబు ఇన్నాళ్లు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడని, ఇప్పుడు దేవుళ్లను కూడా వాడుకుంటున్నాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 గుళ్ళను ప్రభుత్వమే కూల్చిందని ప్రతిదాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ. గత ప్రభుత్వకాలంలో కూల్చేసిన 40 గుళ్లను అవే స్థానాల్లో తిరిగి నిర్మించాలని జగన్ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే తాజా పరిణామాలతో పావులు చురుగ్గా కదుపుతోంది.

ధ్వంసమైన గుళ్లను పునరుద్ధరించటం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలు ప్రజల్లోకి పంపించగలుగుతామని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో దేవాలయాలను అధికారికంగా ధ్వంసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆ సమయంలో దేవాదాయ శాఖ మంత్రిత్వ బాధ్యతలు చూసిన బీజేపీ, వీరి మిత్రపక్షం జనసేననూ కలిపి ఎండగట్టాలనేది జగన్ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news