జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలంతా చప్పుడు చేయకుండా ఉన్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అటు టీడీపీ, ఇటు వైసీపీలు మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామని ఇప్పటికే అనేక సార్లు చెబుతూ వచ్చాయి. అలాగే ఫలితాలపై ఆ పార్టీల నాయకులు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ, వైసీపీల పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు జనసేన పరిస్థితి మాత్రం అదోలా ఉంది. ఎందుకంటే.. ఎన్నికల్లో గెలుస్తామని ఆశల పెట్టుకున్న ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశలో, నిస్సత్తువలో కూరుకుపోయారని సమాచారం అందుతోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలంతా చప్పుడు చేయకుండా ఉన్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేనకు సింగిల్ డిజిట్‌లోనే ఎమ్మెల్యే స్థానాలు దక్కుతాయని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పిన నేపథ్యంలో పవన్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జనసేన శ్రేణుల్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది.
ఓ వైపు టీడీపీ ఈవీఎంలు, వీవీ ప్యాట్లు అని నానా రభస చేస్తుంటే… మరో వైపు వైసీపీ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు నిత్యం కాపలా కాస్తోంది. అయితే జనసేన మాత్రం ఏ విషయంపై స్పందించకుండా అలాగే నిస్సత్తువగా ఉంది. ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణిలో జనసేన ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే.. ఫలితాలు తమకు అనుకూలంగా రావని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
అయితే ఎన్నికల సమయంలో జనసేన తామే అధికారంలోకి వస్తామంటూ కామెంట్ చేసింది. ఏపీలో నిశ్శబ్ద విప్లవం ఉందని, ఓటింగ్ తమకే అనుకూలంగా జరిగిందని, కనుక తామే కింగ్ మేకర్లం అవుతామంటూ.. ప్రచారం చేసింది. కానీ రాను రాను ఆ పార్టీ నేతలు మౌనంగా ఉంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాము 5 ఎంపీ సీట్లు, 40 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెప్పారు. కానీ ఈ సారి ఎన్నికల ఫలితాలు అంతు చిక్కకుండా ఉండడంతో ఆయన రాను రాను సైలెంట్ అయిపోయారు. దీంతో అటు జనసేన కార్యకర్తల్లో రోజు రోజుకీ ఆందోళన పెరిగిపోతోంది.
ఏపీలో మార్పు తెస్తానంటూ పవన్ జనసేనతో ఒంటరిగా బరిలోకి దిగారు. మరి ఆయన మాటలను ప్రజలను విన్నారా, లేదా అన్నది మే 23వ తేదీతో తెలిసిపోనుంది. అయితే ఇప్పుడు జనసేన నేతలు మాత్రం తాము అనుకున్న సీట్లు రావనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. దీంతో కింగ్ మేకర్ అవడం అటుంచితే.. కనీసం ఆ పాత్రకు సరిపడా సీట్లు కూడా రావని ఆ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.
ఓ వైపు టీడీపీ, మరో వైపు వైసీపీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటే.. తమకు ఇన్ని స్థానాలు వస్తాయని లెక్కలు చెబుతుంటే.. మరోవైపు జనసేన అధినేత మౌనంగా ఉండడం ఆ పార్టీ నేతలకే నచ్చడం లేదు. ఈ క్రమంలో జనసేన శ్రేణుల్లో ఓ రకమైన నైరాశ్యం వచ్చేసిందని చర్చ వినిపిస్తోంది. అయితే ఈ నెల 23వ తేదీ వస్తే గానీ జనసేన భవితవ్యం ఏమిటో తేలదు. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే..!
—