టీఆర్ఎస్ సర్కారుపై స్వరం మార్చిన కడియం.. ఎందుకోసమో?

-

టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ‘దళిత బంధు’పై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ విదితమే. ‘దళిత బంధు’ స్కీమ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారుపై కడియం స్వరం మార్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ధిక్కార స్వరం వైపునకు కడియం అడుగులు వేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కడియం శ్రీహరికి బాగానే ప్రయారిటీ ఇచ్చారు.

కానీ, రెండో సారి ప్రభుత్వంలో కడియం శ్రీహరిని కనీసంగానైనా పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో వరంగల్‌కు సీఎం కేసీఆర్ వచ్చిన క్రమంలో కడియం శ్రీహరి ఇంట్లోనే బస చేశారు. ఈ క్రమంలోనే పదవి గురించి ఎలాంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఇక ‘దళిత బంధు’ గురించి స్వయంగా దళితుడైన కడియం మాటలు విని అయినా ఆయన్ను గుర్తిస్తారని భావించారో? ఏమో? తెలియదు. కానీ, కడియం శ్రీహరి మాత్రం కొంత కాలం నుంచి పార్టీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ గురించి బెడిసికొడుతుందనే వ్యాఖ్యలు చేశారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇవి బెదిరింపు వ్యాఖ్యలుగా పరిగణించాలా? అనే ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. అయితే, కడియం శ్రీహరి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ అధినేత స్పందించలేదు. చూడాలి మరి.. మళ్లీ గతంలో మాదిరిగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలోకి కడియం శ్రీహరి ఎంట్రీ ఇస్తారో.. లేదో.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో కడియం శ్రీహరి చాలా చురుకుగా వ్యవహరించిన సంగతి అందరికీ విదితమే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు. అయితే, ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ నేతగానే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనకు మళ్లీ పదవి ఆఫర్ చేస్తుందో? లేదో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news