కల్వకుంట్ల కవితకు మళ్లీ ఎమ్మెల్సీ! మంత్రిగా చాన్స్?

-

టీఆర్ఎస్‌లో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యా బలం దృష్ట్యా ఎమ్మెల్యే కోటాలోని ఆరు, స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలు కూడా గులాబీ పార్టీ ఖాతాలో పడనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నది.

ఎన్నికలు జరగనున్న 12 స్థానాల్లో నిజామాబాద్ అభ్యర్థి విషయంలో మాత్రమే స్పష్టత కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి నుంచి కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ టికెట్ ఆశించకపోవడంతో మళ్ళీ కవితకే చాన్స్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. మరోవైపు ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో మంత్రివర్గంలో ఓ స్థానం ఖాళీ‌గా ఉన్నది. కల్వకుంట్ల కవిత మళ్లీ ఎమ్మెల్సీ‌గా ఎన్నికైన తర్వాత ఆమెను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

మిగిలిన 11 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. తిరిగి తమకే అవకాశం కల్పించాలని సిటింగ్ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఈసారి తమకు అవకాశం లభిస్తుందని మరికొందరు ఆశావహులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తోపాటు గోడం నగేష్, కుచాడి శ్రీహరిరావు, అరవింద్‌రెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి పోటీలో ఎంసీ కోటిరెడ్డి, చాడ కిషన్‌రెడ్డి ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌లోని రెండు సిట్టింగ్ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు తిరిగి టికెట్ ఆశిస్తుండగా మాజీ మంత్రి ఎల్.రమణ, రవీందర్‌సింగ్, కోడూరి సత్యనారాయణ గౌడ్, జైపాల్‌రెడ్డి, ఈద శంకర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సిటింగ్ సభ్యుడు వి.భూపాల్‌రెడ్డికి ప్రస్తుతం పోటీలో ఎవరూ లేరు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానం నుంచి సిటింగ్ సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికే మళ్లీ అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవకావం దక్కే చాన్స్ కనిపిస్తున్నది. రాజకీయ అనుభవం, సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Latest news