కవితకు కొత్త సీటు..గ్రేటర్ పరిధిలో గెలుపు సాధ్యమా?

-

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో పోటీపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె ఎంపీగా పోటీ చేస్తారని, అది కూడా నిజామాబాద్ బరిలో దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముందు జరగనున్నాయి. ఆమె పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని, కాబట్టి ఆమెని అసెంబ్లీ బరిలో దింపడానికి చూస్తున్నారనే ప్రచారం వచ్చింది.

ఈ క్రమంలోనే కవిత జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తారని ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. ఇప్పటికే జగిత్యాలలో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు..గత ఎన్నికల్లో సంజయ్‌ని గెలిపించింది కవితనే..అయితే ఇప్పుడు సంజయ్ పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని తప్పించి కవితని పోటీకి దింపుతారని చర్చ నడిచింది. కానీ ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఆమె పోటీ చేసే నియోజకవర్గం మారింది. అసలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కే‌సి‌ఆర్ ఫ్యామిలీ ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈ సారి కవితని జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో ఉన్న సీటులో పోటీకి దింపుతారని కథనాలు వస్తున్నాయి.

అది కూడా ముషీరాబాద్ సీటులోనే పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సైతం..కవిత వస్తే సీటు త్యాగానికి కూడా రెడీగా ఉన్నారని అంటున్నారు. కవిత ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి కార్యాలయం ఇక్కడే ఉండడంతో దానిద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. అటు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేయడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు గాంధీనగర్‌ డివిజన్‌కు ఆమె ఇన్‌చార్జిగా పనిచేశారు.

ఇప్పటికే ముషీరాబాద్ లో తన పోటీపై కవిత రహస్యంగా సర్వే చేయించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు అధిక శాతం ఉండటం, అందులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. చిన్న నియోజకవర్గం కావడంతో తన గెలుపు సులువుగా ఉంటుందని ఇక్కడినుంచి పోటీ చేసేందుకు కవిత ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి కవిత ఎక్కడ పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news