మహిళా రిజర్వేషన్ల కోసం సిఎం కేసిఆర్ కుమార్తె, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక్కరోజు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరుతూ..దేశంలోని విపక్ష మహిళా నేతలతో కలిసి దీక్షకు దిగారు. ఈ దీక్షకు పలువురు విపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తెలంగాణ నుంచి కూడా మహిళా నేతలు దీక్షలో పాల్గొన్నారు.
అయితే ఇటు తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం హయాంలో బెల్టు షాపులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా బిజేపి మహిళా నేతలు ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఇలా పోటాపోటిగా రాజకీయ దీక్షలు చేస్తున్నారు. కాకపోతే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారించే ఒక్కరోజు అదే ఢిల్లీలో దీక్ష చేయడం వెనుక రాజకీయ కోణం ఉందనే చెప్పాలి. ఈడీ విచారించాక ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక ప్రచారం వస్తుండగానే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్ళై..తన వాంగ్మూలన్ని వెనక్కి తీసుకుంటానని ఢిల్లీ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దీంతో కోర్టు..ఈడీకి నోటీసులు జారీ చేసింది. కాగా, ఇటీవల పిళ్లై ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో తను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఈడీ సైతం కవితని విచారించడానికి రెడీ అవుతున్నారు. అయితే వచ్చిన లాభాల్లో కవిత, పిళ్లై అకౌంట్లకు వెళ్లినట్టు డిజిటల్ ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీకి వచ్చిన వాంగ్మూలన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పిళ్ళై పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. మరి ఈ విషయంలో ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.