కేసీఆర్ నిర్ణయంతో..ఇరకాటంలో ఆ ఇద్దరు మంత్రులు

Join Our Community
follow manalokam on social media

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత వచ్చిన మార్పులతో ఇరకాటంలో పడ్డారట కొందరు మంత్రులు. మొన్నటి వరకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకంగా ఉండటంతో ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. పార్టీ మూడ్‌కు అనుగుణంగా మంత్రులు మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు అదే గళం సవరించాల్సి రావడం.. పచ్చివెలక్కాయ గొంతులో పడినట్టుగా ఉందట. ఆ ఇద్దరు మంత్రులు విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలా అని తర్జనభర్జన పడుతున్నారట.

కేంద్ర వ్యవసాయ చట్టాల విషయంలో ఎంతో కొంత సానుకూల వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తుంది టీఆర్ఎస్ సర్కార్. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు అంశాలలో గతంలో టీఆర్‌ఎస్‌ తీసుకున్న వైఖరికి ఇప్పటి పరిణామాలకు అస్సలు పొంతన లేదు. దీంతో ఆయా శాఖలు చూస్తోన్న మంత్రులకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారిందట. కొత్త వ్యవసాయ చట్టాలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గతంలో నిప్పులు చెరిగారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మంచిదన్న అభిప్రాయాన్ని గతంలో వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్‌. ఇప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరింది.

ఈ వైఖరిపై విపక్షాలు పదునైన విమర్శలు చేస్తున్నాయి. అయినా ఇప్పుడు కూడా దాదాపుగా ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు ఈటల. ఈ అంశంలో ఒక మాట అటు తుళ్లినా.. ఇటు మళ్లినా తేడా కొడుతుంది. గతంలో మాట్లాడిన అంశాలకు పూర్తి భిన్నంగా మాట్లాడినా సోషల్‌ మీడియాలో ఆడుకుంటారు. దాంతో పార్టీ లైన్‌.. మూడ్‌ ఏంటో తెలుసుకుని చాలా జాగ్రత్తగా పదాలను లెక్కపెట్టుకుని మరీ పలుకుతున్నారట.

అదే పనిగా విపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్‌ ఇవ్వకపోయినా మంత్రులకు ఇబ్బందే. అటు పార్టీ అధిష్ఠానం దగ్గర ఇటు ప్రజల్లోనూ వెనకబడ్డామనే ముద్ర పడే ప్రమాదం ఉంది. అలా అని దూకుడుగా ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. విపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిందే. అంతే స్థాయిలో సమాధానం చెప్పాల్సిందే. కాకపోతే సూటిగా సుత్తి లేకుండా మాట్లాడినా.. అది సుత్తితో కొట్టినట్టు ఉండాలన్న లెక్కలు వేసుకుంటున్నారట మంత్రులు. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని ఇద్దరి పరిస్థితి తలచుకుని పాపం.. మంత్రులు అని చర్చించుకుంటున్నారట అధికార పార్టీ నాయకులు.

కొన్నాళ్లపాటు ఈ అడకత్తెర పరిస్థితి తప్పకపోవచ్చు. వారికి అగ్నిపరీక్షే అవ్వొచ్చు. మరి టెస్టింగ్‌ టైమ్‌ను మంత్రులు ఎలా పాస్‌ అవుతారో చూడాలి.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....