కారుతో కమలం దోస్తీ…ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇప్పుడుప్పుడే తెలంగాణలో పైకి వస్తున్న బిజేపికి…ఈ ప్రచారం చాలా నెగిటివ్ అవుతుందనే చెప్పొచ్చు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఈ నినాదం అందుకున్నారు…టిఆర్‌ఎస్-బిజేపిలు ఒక్కటే అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ని హైలైట్ చేసే క్రమంలో రేవంత్ ఈ తరహా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇక రేవంత్ చేసే విమర్శలకు అటు టిఆర్‌ఎస్, ఇటు బిజేపిలు సైతం కౌంటర్లు ఇస్తూ వచ్చాయి.
కానీ ఎన్ని కౌంటర్లు ఇచ్చిన తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని గమనిస్తే…కారుతో కమలం దోస్తీ ఉందా అనే అనుమానం రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే వారి మధ్య రాజకీయం ఆ విధంగా నడుస్తుంది కాబట్టి. రాష్ట్రంలో కయ్యం పెట్టుకున్నట్లు కనిపించినా, ఢిల్లీలో మాత్రం వియ్యం పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన కేసిఆర్….బిజేపితో ఏదో సంబంధాలు ఉన్నాయనే కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. కేసిఆర్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలోని బిజేపి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలైంది.
కేసిఆర్ కావాలనే ఈ విధంగా రాజకీయం చేసి, బిజేపిని ఇరుకున పెడుతున్నట్లు అందరికీ అర్ధమైంది. అంటే టిఆర్‌ఎస్-బిజేపిలు పొత్తు పెట్టుకుంటున్నాయనే కోణాన్ని కేసిఆర్ క్రియేట్ చేశారు. దీంతో టిఆర్‌ఎస్-బిజేపిలు ఒక్కటి కాదని వివరణ ఇవ్వలేక రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నానా కష్టాలు పడుతున్నారు. అసలు ఊహించని విధంగా కేసిఆర్…బిజేపితో పొత్తు ఉన్నట్లు క్రియేట్ చేయడంతో, తమతో కేసిఆర్‌కు పొత్తు లేదని చెప్పడానికి బండి చాలా కష్టపడుతున్నారు.
పాదయాత్రలో టిఆర్‌ఎస్‌ని విమర్శించడం కంటే ముందు….తమకు ఆ పార్టీతో పొత్తు ఉండదని చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేసిఆర్…ఇప్పటికే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, తాము ఇంతవరకు టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదని భవిష్యత్‌లో కూడా పెట్టుకోమని, 2023 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. మరి బండి ఎంత వివరణ ఇచ్చినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా డైవర్షన్ పాలిటిక్స్‌లో కేసిఆర్ కింగ్ అని చెప్పొచ్చు.