‘చిన్న మనిషి ఈటల రాజేందర్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు’ అని సీఎం కేసీఆర్ పైకి రాజకీయంగా మాట్లాడుతూ…లోపల మాత్రం ఆ చిన్న మనిషికే పెద్దగా భయపడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న మనిషి అంటూ తేలికగా మాట్లాడుతూ…హుజూరాబాద్‌లో ఆ చిన్న మనిషిని ఓడించడానికి పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అంటే అది ఈటల సత్తా అనే చెప్పొచ్చు.
లేదంటే ఇన్ని వందల కోట్లతో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క హుజూరాబాద్‌కే చేయాల్సిన పని లేదు. కానీ హుజూరాబాద్‌లో ఈటల దెబ్బకి కేసీఆర్ ఈ విధంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా ఈటల, టీఆర్ఎస్‌ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికలో ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే ఇంకా కేసీఆర్ పరిస్తితి మామూలుగా ఉండదు.
అసలు టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలకు మంచి ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్‌లో చాలామంది అసంతృప్తి నేతలు ఉన్నారు. కానీ వారు అధికారం, కేసీఆర్‌ని చూసి సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ అదే టీఆర్ఎస్ నుంచి బయటకెళ్లిన ఈటల, ఇప్పుడు హుజూరాబాద్ బరిలో గెలిస్తే, ఆ సంతృప్తి నేతలు ఇంకా కేసీఆర్‌ని లెక్క చేయరు. వారు కూడా తమ దారి తాము చూసుకుంటారు. అలాగే ఉపఎన్నిక దృష్టిలో పెట్టుకునే హుజూరాబాద్‌కు ఇన్ని రకాలుగా కేసీఆర్ వరాలు ఇస్తున్నారు.
ఇక ఈ ఎన్నికయ్యాక మిగిలిన నియోజకవర్గాల్లో ఇవే కార్యక్రమాలు అమలు చేయకపోతే టీఆర్ఎస్ కొంపమునగడం ఖాయం. ఏదో ఎన్నికల కోసమని తాయిలాలు ఇస్తే, అదే తాయిలాలు మిగిలిన నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతారు. పైగా దళితబంధు పేరిట కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారు. ఈ పథకం ప్రభావంతో కేసీఆర్ ఎంత లాభపడతారో తెలియదు గానీ, నష్టం మాత్రం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈటల, కేసీఆర్‌ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేలా కనిపిస్తున్నారు.