కేసీఆర్ ‘గురివింద’ నీతి..కమలం-కాంగ్రెస్ ఫెయిల్..!

-

రాజకీయాల్లో నేతల మాటలు ఒకోసారి చాలా వింతగా ఉంటాయి..తాము చేసే తప్పులు చెప్పకుండా…ప్రత్యర్ధులు చేసే తప్పులని ఎత్తిచూపుతూ తాము ఏదో నీతివంతులం అన్నట్లు చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చేసే రాజకీయం కూడా అలాగే ఉంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలని లాగేసి..ఇప్పుడు బీజేపీ వాళ్ళు తమ ఎమ్మెల్యేలని లాగుతున్నారని, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని చెప్పి కేసీఆర్ మాట్లాడటమే పెద్ద ఘోరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది నేతలు ఇష్టం..కానీ విలువలు ఆధారంగా పార్టీల మారడం అనేది ఉంటుంది..ఒక పార్టీలో గెలిచి, మరొక పార్టీలోకి వెళ్ళడం అనేది ఏ మాత్రం విలువలు లేని రాజకీయం. ఈ విలువలు లేని రాజకీయాలని అన్నీ పార్టీలు చేస్తున్నాయి. దేశంలో బీజేపీ అదే విధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలని లాగి అనేక ప్రభుత్వాలని కూల్చేసింది.

ఏపీలో అంతకముందు అధికారంలో ఉన్న టీడీపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా అదే చేస్తుంది. ఇక 2014 నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ చేస్తుంది అదే. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 37 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్..టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, ఇండిపెడెంట్ ఎమ్మెల్యేలని లాగేశారు. అదేమంటే అభివృద్ధి కోసమని, బంగారు తెలంగాణ కోసమని పార్టీ మారమని ఎమ్మెల్యేలు చెప్పుకోవడం పెద్ద విడ్డూరం. ఎలాంటి ప్రలోభాలు, ప్యాకేజ్‌లు లేకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారారు అంటే నమ్మడానికి ప్రజలు చెవుల్లో పువ్వులు లేవు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలని లాక్కున్న కేసీఆర్ ఇప్పుడు..తమ ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేయడానికి చూస్తుందని, తన కుమార్తె కవితని కూడా తీసుకుందామని చూశారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? అని అంటున్నారు. అయితే ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ముమ్మాటికి తప్పే..కానీ ఇంతకాలం కేసీఆర్ చేసింది ఏంటి? పూర్తిగా గురివింద గింజ నీతి చెబుతున్నారు.

కాకపోతే కేసీఆర్ ఏం మాట్లాడితే అది జనంలోకి ఈజీగా వెళుతుంది..కానీ అదే అంశాన్ని కాంగ్రెస్, బీజేపీలు హైలైట్ చేయడంలో విఫలమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్..తమ పార్టీ ఎమ్మెల్యేలని ఎలా లాక్కున్నారు..ఏంటి అనే అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కాకపోతే ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి..వారే భవిష్యత్‌లో తీర్పు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news