గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అధికార దర్పంతో ఉదాసీనంగా ఉంటే ఏం జరుగుతుందో ? బీజేపీ ఎంతలా షాక్ ఇస్తుందో ? ఇప్పటికే గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఫ్రూవ్ చేశాయి. ఈ రెండు ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ నాయకుల దర్పం ఆకాశం నుంచి నేలమీదకు వచ్చింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ దూకుడుతో ఏం కొం ప మునుగుతుందో ? అన్న టెన్షన్ కారు పార్టీ నాయకులను వెంటాడుతోంది.
తాజాగా టీఆర్ఎస్ అసంతృప్త నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు. ఈ పరిణామాలతో అసలే టెన్షన్‌లో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. వెంటనే పలువురు నేతలు స్వామిగౌడ్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించేశారు. మరి కొందరు ఏమైంది అంటూ ఆరాలు తీశారు.
బీజేపీ నేతలతో భేటీ అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ వారితో కలయిక ఆత్మీయ కలయిక మాత్రమే అని.. అది కూడా తప్పేనా ? అని ప్రశ్నించారు. వారు తన స్నేహితులు అని చెప్పారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వామిగౌడ్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్ స్వామిగౌడ్‌ను పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీ సీటు అడిగినా పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు స్వామిగౌడ్ పార్టీలో ఇమడ లేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై బీజేపీ వల వేసిందంటున్నారు. దీనికి తోడు స్వామిగౌడ్, బీజేపీ నేతల భేటీ తర్వాత లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి వచ్చేందుకు చాలా మంది నేతలు రెడీగా ఉన్నారని బాంబు పేల్చారు. ఆయన స్వామిగౌడ్ పేరు చెప్పకపోయినా ఆయన కూడా పార్టీ మారే వారి లిస్టులో ఉన్నారని లక్ష్మణ్ చెప్పకనే చెప్పారని చర్చలు స్టార్ట్ అయ్యాయి.
మరోవైపు ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. ఆమెకు అసెంబ్లీ సీటుపై హామీ వస్తే ఆమె కూడా పార్టీ కండువా మార్చేందుకు రెడీగా ఉన్నట్టు టాక్. ఆమె టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు సమీప బంధువు.
-Vuyyuru Subhash