వీళ్ళు తగ్గారు…వాళ్ళు తగ్గట్లేదు..తేడా కొడుతుందే…!

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గట్లేదు. తెలంగాణ మంత్రులు వరుసపెట్టి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అలాగే దివంగత వైఎస్సార్‌ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మొదట్లో ఏపీ నేతలు, తెలంగాణ నేతలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సడన్‌గా ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎంట్రీ ఇచ్చి, తెలంగాణ నేతలు రెచ్చగొడుతున్నారని, అయినా సరే సమన్వయంగా ఉంటామని చెప్పారు.

సజ్జల ఎంట్రీ తర్వాత ఏపీ నేతలు సైలెంట్ అయ్యారు. కానీ తెలంగాణ మంత్రులు ఆగట్లేదు. వరుసపెట్టి విమర్శలు చేస్తూ వస్తున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌లు తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్, జగన్‌లని దొంగలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని… తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేశారని అంటున్నారు.

అలాగే ఏపీ ప్రాజెక్టులు అక్రమమని, తెలంగాణ ప్రాజెక్టులు సక్రమమని అంటున్నారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అలా కాకుండా చట్ట విరుద్ధంగా వెళితే ఏపీ సీఎస్‌ని జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇలా రాయలసీమ ప్రాజెక్టుకు ఎన్జీటీ బ్రేక్ వేసినా, ఏపీ నేతలు సైలెంట్‌గా ఉన్నా సరే, తెలంగాణ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసపెట్టి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ నేతలు ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఉపపోరులో లబ్ది పొందేందుకు తెలంగాణ నీటి సెంటిమెంట్ లేపుతున్నారని అంటున్నారు. అదే సమయంలో ఏపీ నేతలు సైలెంట్‌గా ఉండటానికి కారణాలు ఉన్నాయని, ఏపీ నేతలకు చాలామందికి హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని, అలాగే రాయలసీమ ప్రాజెక్టు నిబంధనలకు లోబడి కడుతున్నారో లేదో క్లారిటీ ఇవ్వడం లేదని, పైగా ఎన్జీటీ కూడా వార్నింగ్ ఇచ్చిందంటే ఏదో జరుగుతుందనే కదా అని అంటున్నారు.