సైలెంట్‌గా కోమటిరెడ్డి రాజకీయం…జంపింగ్ అప్పుడేనా…

తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. తెలంగాణలో సీనియర్ నాయకుడుగా ఉన్న కోమటిరెడ్డి దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. అలాంటి నాయకుడు ఈ మధ్య కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. ఎంత పి‌సి‌సి పదవి దక్కనంత మాత్రాన ఈ స్థాయిలో సొంత పార్టీకే డ్యామేజ్ జరిగేలా కోమటిరెడ్డి వ్యవహరించడంపై కొందరు కాంగ్రెస్ శ్రేణుల్లోనే అనుమానాలు వస్తున్నాయి.

komatireddy venkatreddy

అసలు కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే కోమటిరెడ్డి…పి‌సి‌సి పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన దగ్గర నుంచి రూట్ మార్చేశారు. రేవంత్‌పై డైరక్ట్‌గానే విమర్శలు చేసేస్తున్నారు. ప్రత్యర్ధులు మాదిరిగా రేవంత్, చంద్రబాబు మనిషి అని పలుమార్లు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే రేవంత్ ఏమో కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకొచ్చి, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. రేవంత్ వచ్చాకే కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో రేసులోకి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే టి‌ఆర్ఎస్‌కు ధీటుగా పార్టీని నిలబెట్టేందుకు రేవంత్ ట్రై చేస్తున్నారు.

అయితే రేవంత్ ప్రయత్నాలకు సపోర్ట్ ఇవ్వకపోయిన పర్లేదు గానీ, ఆయన ప్రయత్నాలకు డ్యామేజ్ జరిగేలా కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. అయిందేదో అయిందని కోమటిరెడ్డి పార్టీ కోసం కష్టపడకుండా, పరోక్షంగా పార్టీకి డ్యామేజ్ చేస్తూ, ప్రత్యర్ధులకు ఛాన్స్ ఇస్తున్నారని భావిస్తున్నాయి.

అసలు ఇలా కోమటిరెడ్డి చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి, కేంద్రంలోని బి‌జే‌పి పెద్దలతో బాగానే చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని, ఆయనకు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌లు సులువుగా దొరుకుంటున్నాయని, అలాగే ఆయన అడిగిన పనులకు కేంద్ర పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారని, అంటే కోమటిరెడ్డి పరోక్షంగా బి‌జే‌పికి సపోర్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరిస్తితిని బట్టి కోమటిరెడ్డి, కమలం చెంతకు చేరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.