కొత్తగూడెం కథలు..కారులో ముగ్గురు పోటీ..కమ్యూనిస్టులతో చిక్కులు.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బాగా డిమాండ్ ఉన్న సీటు ఏదైనా ఉందంటే అది కొత్తగూడెం సీటు అనే చెప్పాలి. ఈ సీటు కోసం అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీటు తమదంటే తమదని నేతలు పోటీ పడుతున్నారు. అసలు కొత్తగూడెం సీటుపై చివరికి సి‌ఎం కే‌సి‌ఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పెద్ద ట్విస్ట్ గా మారింది. వాస్తవానికి గత ఎన్నికల్లో కొత్తగూడెం బరిలో కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. గెలిచిన కొన్ని రోజులకే వనమా పార్టీ మారిపోయారు. బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. వాస్తవానికి కొత్తగూడెంపై వనమాకి మంచి పట్టుంది. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

కాకపోతే వనమాకు తన తనయుడుతో చిక్కులు వచ్చాయి. వనమా కుమారుడు వివాదాల గురించి అందరికీ తెలిసిందే. దీంతో వనమాకు నెగిటివ్ అయింది. దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో సీటు విషయమే డౌట్ లో పడింది. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు..ఈ సారి సీటు తనదే అని ప్రచారం చేస్తున్నారు. తనకు సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, కే‌సి‌ఆర్ తనకే సీటు ఇస్తారని అంటున్నారు.

వీళ్ళు ఇలా ఉంటే..తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు రేసులోకి వచ్చారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పలుమార్లు కే‌సి‌ఆర్ కాళ్ళు మొక్కి హైలైట్ అయిన ఈయన..కొత్తగూడెం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. సొంత ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా  కేసీఆర్‌ ఆదేశిస్తే తప్పకుండా ఆదేశాలని పాటిస్తానని, తన ఉద్యోగానికి రిజైన్ చేయబోతున్నానని, వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని,  కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని,  అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశిస్తే..పోటీ చేస్తానని, అప్పటివరకు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని అన్నారు.

అంటే బి‌ఆర్‌ఎస్ సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో బి‌ఆర్‌ఎస్, సి‌పి‌ఐ పొత్తు ఉంటుందని, అప్పుడు సి‌పి‌ఐ నుంచి తాను పోటీ చేస్తానని కూనంనేని సాంబశివరావు అంటున్నారు. ఇలా కొత్తగూడెం సీటుపై రకరకాల ప్రచారాలు వస్తున్నాయి. చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news