మనసు కాంగ్రెస్ తో మద్దతు మాత్రం టీఆర్ఎస్ కు..కమ్యూనిస్ట్ పార్టీల ఆంతర్యం ఇదేనా

తెలంగాణలో కామ్రేడ్ లకు అసలు కాలం కలిసి రావడం లేదు. సాగర్ ఉప ఎన్నిక వేళ లెఫ్ట్‌ పార్టీలు నుంచి వస్తున్న సంకేతాలు రాజకీయంగా వేడి రగిలిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో సీపీఐ, సీపీఎం పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీల మద్దతు ఎవరికి అన్న చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉపఎన్నిక కావడంతో లెఫ్ట్‌ వైఖరి పై హైప్‌ మరింత పెరిగింది. మద్దతు అడిగిన కాంగ్రెస్ ని కాదని అధికారపార్టీకి వామపక్షాలు జైకొట్టినట్టు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.

2014లో నాగార్జునసాగర్‌లో సీపీఎం పోటీ చేయగా..ఆ పార్టీ అభ్యర్థికి 2 వేల ఓట్లు పడ్డాయి. 2018లో లెఫ్ట్‌ పార్టీలు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థికి సపోర్ట్ చేశాయి. BLFకు 680 ఓట్లే వచ్చాయి. 2014, 2018 ఎన్నికలు ఎలా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ఉపఎన్నిక లెక్క వేరు. త్రిముఖ పోరు ఉధృతంగా ఉంది. ప్రతి ఓటు కీలకమే. అందుకు తగ్గట్టుగానే పార్టీల ఎన్నికల వ్యూహం ఉంది. కలిసి వచ్చే సంఘాలను, పార్టీలను వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. న్యూట్రల్‌గా ఉన్నవారి మనసును కూడా మార్చే ప్రయత్నంలో నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీల దారెటు అన్న చర్చ జరిగింది.

ఎవరికి మద్దతు ఇస్తున్నది లెఫ్ట్‌ పార్టీలు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఎవరికి ఓటు వేయాలో.. ఇంకెవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకునే బాధ్యతను స్థానిక నాయకత్వానికే వదిలేసినట్టు చెబుతున్నారు. కాకపోతే వారి మొగ్గు అధికార టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు మద్దతిచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా గులాబీ పార్టీ వైపు చూసినట్టు చెబుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు నిర్ణయం లోకల్‌ కేడర్‌కే అప్పగించేశారు.

నాగార్జునసాగర్‌లోనూ అదేవ్యూహం అమలు చేస్తున్నాయి వామపక్షాలు. కాకపోతే హుజూర్‌నగర్‌లో లెఫ్ట్ పార్టీలు టీఆర్‌ఎస్‌కే మద్దతిచ్చాయని ఏ విధంగా చివరి వరకు ప్రచారం జరిగిందో అదే సీన్‌ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో లెఫ్ట్‌ పార్టీలు కలిసి సాగుతున్నాయి. ఇక్కడ మాత్రం భిన్నమైన వైఖరిని ఎంచుకున్నాయి. అధికార పార్టీకి మద్దతు ఇస్తే భవిష్యత్తులో తమ పోరాటాలకు ప్రజల మద్దతు కూడగట్టడం కష్టమవుతుందని అని లెఫ్ట్ పార్టీల కేడర్ భావిస్తుంది.

రెండు వామపక్ష పార్టీల్లో ఒకటి టీఆర్‌ఎస్ కు, మరోటి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలు ఎర్ర జెండాకు అండగా నిలబడేవారు. అసెంబ్లీకి ప్రాతినిధ్యం కూడా ఇక్కడి నుండే ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్ లు రాజకీయంగా దెబ్బతిన్నారు. కాంగ్రెస్ మద్దతు అడుగుతుందని సానుకూలంగా ఉన్నా పోటీ చేస్తే గెలవలేక పోతున్నాం..మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా గెలవడం లేదన్న బాధ కమ్యునిస్ట్ నేతలను వేధిస్తుందట. దీంతో టీఆర్‌ఎస్‌కు వామపక్షాలు జైకొడుతున్నాయట.