మోగిన ఎన్నిక‌ల న‌గారా.. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11నే పోలింగ్‌..!

-

ఏప్రిల్ 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌స‌భ‌ల‌తోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలో మే 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఎట్ట‌కేల‌కు న‌గారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవాళ విడుద‌లైంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు కూడా షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ మేర‌కు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా ఎన్నిక‌ల షెడ్యూల్ వివ‌రాల‌ను తెలిపారు. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు లోక్‌స‌భ స్థానాల్లోనూ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని సునీల్ తెలిపారు. మొత్తం 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయని, ఏప్రిల్ 11న తొలి ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని, రెండో ద‌శ ఏప్రిల్ 18న‌, మూడో ద‌శ ఏప్రిల్ 23న‌, నాలుగో ద‌శ ఏప్రిల్ 29న‌, ఐదో ద‌శ మే 6న‌, ఆరో ద‌శ మే12న‌, ఏడో ద‌శ మే 19న నిర్వ‌హిస్తామ‌ని అరోరా వెల్ల‌డించారు. ఇక మే 23వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌తో దేశంలో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింద‌న్నారు. ఏపీలో 175, ఒడిశాలో 147, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

10 ల‌క్ష‌ల పోలింగ్ కేంద్రాలు.. పోలింగ్ కు 5 రోజుల ముందే స్లిప్పుల పంపిణీ…

ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సునీల్ అరోరా తెలిపారు. ఈ క్ర‌మంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ ఎన్నిక‌ల సంఘాలు, ప్ర‌భుత్వాల‌తో ఇప్ప‌టికే అనేక సార్లు చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని అన్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు, బ‌ల‌గాల మోహ‌రింపు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించామ‌ని అన్నారు. అలాగే పండుగ‌లు, ప‌రీక్ష‌ల‌ను దృష్టిలో ఉంచుకునే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రూపొందించామ‌ని అన్నారు. ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తామ‌న్నారు. అలాగే వారి కోసం తాగునీరు, టాయిలెట్లు వంటి స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. దీంతోపాటు పోలింగ్‌కు 5 రోజుల ముందుగానే ఓట‌రు స్లిప్పులను పంపిణీ చేస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల పోలింగ్ కేంద్రాల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ సారి అద‌నంగా మ‌రో ల‌క్ష పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. స‌మ‌స్యాత్మక ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేస్తామ‌ని తెలిపారు. కాగా ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం కోసం 12 ర‌కాల గుర్తింపు కార్డుల‌ను అనుమ‌తిస్తామ‌ని అరోరా వివ‌రించారు.

ఏపీ, ఒడిశా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, సిక్కిం రాష్ట్రాల‌కు గాను అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకే ద‌శ‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను మొత్తం 7 ద‌శ‌ల్లో నిర్వ‌హిస్తారు.

మొద‌టి ద‌శ (ఏప్రిల్ 11)…

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, లక్షద్వీప్‌

రెండో దశ (ఏప్రిల్ 18)…

జమ్ముకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, పుదుచ్చేరి

మూడో దశ (ఏప్రిల్ 23)…

అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్, జమ్ముకశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ

నాలుగో దశ (ఏప్రిల్ 29)…

బిహార్‌, జమ్ముకశ్మీర్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌

ఐదో దశ (మే 6)…

బిహార్‌, జమ్ముకశ్మీర్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌

ఆరో దశ (మే 12)…

బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, దిల్లీ

ఏడో దశ (మే 19)…

బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, చండీగఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌

తొలిద‌శ‌లో ఏపీ, తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌లు.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు…

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకే ద‌శ‌లో నిర్వ‌హిస్తామ‌ని చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా తెలిపారు. ఈ క్ర‌మంలో ఏపీ, తెలంగాణ‌తోపాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి ద‌శ‌లోనే లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఏప్రిల్ 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌స‌భ‌ల‌తోపాటు అటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతాయి. ఈ క్ర‌మంలో మే 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇక ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌స‌భ స్థానాల‌కు, తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్థానాల‌కు ఏప్రిల్ 11వ తేదీనే ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కాగా 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. కానీ ఇటీవ‌లే తెరాస ప్ర‌భుత్వం ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లింది. దీంతో ప్ర‌స్తుతం ఏపీలోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా ఉంది.

* మార్చి 18వ తేదీన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంది.
* మార్చి 25వ తేదీ వ‌రకు నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.
* మార్చి 26వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు.
* మార్చి 28వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆఖ‌రి తేదీగా నిర్ణయించారు.
* ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జ‌రుగుతుంది.
* మే 23వ తేదీన ఓట్ల‌ను లెక్కిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news