పాలమూరు బీజేపీలో చిచ్చు రేగింది అందుకేనా

-

కమలదళంలో ముసలం మొదలైంది . పాత, కొత్త క్యాడర్ మధ్య కలహం ముదిరి…ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలోనే కుమ్ములాటలు బహిర్గతమై ఏకంగా జిల్లా అధ్యక్షుడే తన పదవికి రాజీనామా ఎపిసోడ్ కు తెరలేపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హేమా హేమీలున్న పాలమూరు కమలదళంలో ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో అన్న చర్చ కొనసాగుతోంది.

 

రాజకీయ ఉద్దండులకు తోడు , దుబ్బాక , జిహెచ్ఎంసి విజయాలతో మాంచి ఊపు మీదున్నపాలమూరు బిజెపి లో చిచ్చు రేగింది. క్రమశిక్షణకు కేరాఫ్ గా ఉండే కమలం పార్టీలో అంతర్గత కలహలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. బిజెపి పాత, కొత్త నేతల మద్య సయోద్య లోపించి రాజీనామాల రగడకి కారణమైంది. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామ చేయడం , అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్క బెట్టడంతో అసలు పాలమూరు బిజెపి లో ఏం జరుగుతోందనే చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటన సాగుతున్న క్రమంలోనే జిల్లా అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా ప్రకటన కలకలం రేపింది.

టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది ఆగస్టులో బిజెపిలో చేరారు ఎర్ర శేఖర్ . ప్రస్తుతం రాష్ట్ర , జాతీయ పార్టీలో కీలక పదవుల్లో ఉన్ననేతల ఆశీస్సులతోనే ఎర్రశేఖర్ కు బిజెపి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. అయితే జిల్లా అధ్యక్షుడిగా నియామకం జరిగినప్పటి నుంచి పాత నేతల్లోని ఓ వర్గం నుంచి సహాయ నిరాకరణ జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది ఎర్ర శేఖర్ వర్గం. మరో పక్క పాత, కొత్త నేతలకు అసలే పొసగడం లేదని తెలుస్తోంది . చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని పాత నేతలు అడ్డుకోవడం సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఎర్ర శేఖర్ రాజీనామాకు కారణమైనట్లు తెలుస్తుంది.

పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ కార్యాక్రమాల పై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఎర్రశేఖర్ మనస్థాపం చెందారట.పార్టీ చీఫ్ సంజయ్ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతుందని ఎర్ర శేఖర్ టీం చెప్పుకొస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానూ ఎర్ర‌శేఖ‌ర్‌ను అవ‌మానం జరిగినట్లు భావిస్తోంది అయన వర్గం . బండి సంజయ్ టూర్‌కు సంబంధించి జడ్చర్ల , మహబూబ్ నగర్ , దేవరకద్ర నియోజక వర్గాల్లో పలు కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడి టూర్ మాట మాత్రం కూడా చెప్పకుండా పాత నేతలు ఖరారు చేశారట.

మూడు సార్లు ఎంఎల్ఎగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గంలో తనకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోతే తనకు జిల్లా అధ్యక్ష పదవితో గౌరవం పెరిగినట్టా తగ్గినట్టా అనే అంతర్మథనంతో శేఖర్ రాజీనామా ఎపిసోడ్ కు తెరలేపి నట్లు తెలుస్తోంది. గతంలోనూ నాగం జనార్దన్ రెడ్డి , యెన్నం శ్రీనివాస్ రెడ్డి లు పార్టిలో చేరి ఇమడ లేక పోవడానికి సదరు నేతలే కారణమంటున్నారు. వరుస కార్యక్రమాలతో దూకుడుగా మీదున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు జిల్లాలో ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news