బెంగాల్ లో మమతా vs బీజేపీ ఎవరి సత్తా ఎంత

-

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే అప్పుడే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. బెంగాల్‌లో అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది దీదీ. మమతా కోటను బద్దలు కొట్టి తీరతామని ఓ పక్క బీజేపీ ప్యూహాలు రచిస్తున్నాయి. ఇక పార్టీల్లో వలసలు, బీజేపీ, తృణమూల్ ఘర్షణలతో సై అంటే సై అంటున్నాయి రెండు పార్టీలు.

టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్నారు. బీజేపీపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్‌లో పాగా వేసే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీకి చెక్ పెట్టేలా ఓ సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు దీదీ. పదేళ్ల క్రితం దీదీకి అధికారాన్ని తెచ్చిపెట్టిన రైతు ఉద్యమ కేంద్రమే…. ఈ నందీగ్రామ్. అంతేకాదు వీలైతే కోల్‌కతాలోని భవానిపూర్ నుంచీ కూడా పోటీ చేస్తానని మమత తెలిపారు.

నందిగ్రామ్..సువేందు అధికారి సొంత నియోజకవర్గం. మమతా బెనర్జీకి నమ్మిన బంటులా ఉన్న సువేందు..కొద్ది రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన కమలం గూటికి చేరారు. నందిగ్రామ్ ప్రాంతం తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. 2006-08లో నందీగ్రామ్, సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా టీఎంసీ సామూహిక ఉద్యమాలు చేపట్టింది. 2008లో నిర్వహించిన ఈస్ట్ మిడ్నాపూర్ ఎన్నికల్లో టీఎంసీ అత్యధికంగా 35 స్థానాలను గెలుచుకుంది.

ఇక అప్పట్లో జరిగిన ఉద్యమ ప్రభావంతో 2011 ఎన్నికల్లో నాటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఓడిపోయారు. నందీగ్రామ్, సింగూర్‌ ఆందోళనల కారణంగా 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు తెరపడి.. దీదీ సీఎం అయ్యారు. అందుకే నందీగ్రామ్ తనకు లక్కీ ప్లేస్‌ అంటున్నారు మమతా. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు తద్వారా దీదీకి చెక్‌ చెప్పాలని బీజేపీ సర్కార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్ని నెలలుగా బీజేపీ అగ్ర నాయకులు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా, జెపీ నడ్డీ దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మమతా బెనర్జీ పోటీ చేస్తానని ప్రకటించగానే ఈమె మాజీ సహచరుడు , మాజీ మంత్రి సువెందు అధికారిని ఈ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెడతామని బీజేపీ ప్రకటించింది. నందిగ్రామ్ లో మమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని అధికారి ఇటీవల సవాల్ చేశారు. దీన్ని బీజేపీ కూడా సీరియస్ గా తీసుకుంది. తాజాగా కోల్‌కతాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కొందరు రాళ్లు రువ్వారు. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సువేందు అధికారి పాల్గొన్నారు.

మొత్తానికి ప‌శ్చిమ బెంగాల్‌లో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కమలం,తృణముల్ పోటాపోటి ప్యూహాలతో ర‌స‌వత్తరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news