జగన్ పై టిక్ టాక్ చేసాడు, చివరికి…!

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తమకు వ్యతిరేకంగా కథనాలు రాసినా, తమకు వ్యతిరేకంగా వీడియో లు చేసినా, తమను అసభ్యంగా మాట్లాడుతున్నా సరే పోలీసులు ఎక్కడా ఉపేక్షించడం లేదు అనేది అర్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ సహా అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాజాగా కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అసభ్యంగా మాట్లాడుతూ టిక్ టాక్ వీడియో చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా దువ్వూరు కి చెందిన ఒక వ్యక్తి టిక్ టాక్ వీడియో లో ముఖ్యమంత్రి జగన్ ని తిడుతూ వీడియో చేయగా పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నాయుకుడు జయచంద్రారెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన  పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేసిందీ కనుక్కున్న పోలీసులు… చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి లొకేషన్ ట్రేస్ చేసిన అధికారులు… మైదూకురు పట్టణానికి చెందిన పుల్లయ్యగా గుర్తించారు. త్వరలోనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. ఈ ఘటన ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియా విషయంలో పోలీసులు సీరియస్ గా ఉంటున్నారు. ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే చాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు తెలంగాణా ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఆగ్రహంగా ఉంది. ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఫేస్బుక్ టిక్ టాక్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు రెండు రాష్ట్రాల పోలీసులు.