తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గవర్నర్ కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. పూర్తి మెజారిటీ బిఆర్‌ఎస్ పార్టీకే ఉంది కాబట్టి..ఐదు సీట్లు ఆ పార్టీకే దక్కనున్నాయి. అయితే ఎమ్మెల్సీ సీటు కోసం చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఐదు సీట్లు ఉంటే దాదాపు 50 సీట్లు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.
మరి వారికి కేసిఆర్ ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకరికి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే తిప్పలు తప్పవు..నేతలు అసంతృప్తికి గురై..పార్టీ కోసం పనిచేయడం తగ్గిస్తారు. అసలు కేసిఆర్ ఏ విధంగా పదవులు పంచుతారో చూడాల్సి ఉంది. అయితే ఈ ఐదు కాకుండా ఒక టీచర్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కూడా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ స్థానిక సంస్థ కోటాలో ఎంఐఎం అభ్యర్ధి ఏకగ్రీవం అయ్యారు.
అయితే మిగిలిన స్థానాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యమం సమయం నుంచి పార్టీలో పనిచేస్తున్న నేతలు పదవులు ఆశిస్తున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు సైతం పదవిపై ఆశ పెట్టుకున్నారు. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆల్రెడీ బిఆర్‌ఎస్ పార్టీకి దూరమయ్యారు..కాబట్టి ఇక ఆయనకు ఛాన్స్ లేదు.
అలాగే మునుగోడు ఉపఎన్నిక ముందు బిఆర్‌ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్, భిక్షమయ్య గౌడ్, రాపోలు ఆనంద్ భాస్కర్ లాంటి వారు సైతం ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో వీరికి ఎలాగో సీటు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఎమ్మెల్సీ సీట్లని ఎవరికిస్తారో.