బాబు లాగా కేసీఆర్ కూడా మోత్కుపల్లికి హ్యాండ్ ఇస్తారా?

-

మోత్కుపల్లి నర్సింహులు….తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లి దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన మోత్కుపల్లి టీడీపీలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయన టీడీపీ తరుపున ఏ విధంగా అండగా ఉండి, కేసీఆర్‌పై పోరాటం చేశారో అందరికీ తెలిసిందే.

అలా టీడీపీలో కీలకంగా పనిచేసిన మోత్కుపల్లికి చంద్రబాబు గవర్నర్ పదవి హామీ కూడా ఇచ్చారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో తెలంగాణ టీడీపీకి చెందిన మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందని చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. కానీ మోత్కుపల్లికి ఎలాంటి పదవి రాలేదు. పైగా మోత్కుపల్లి నిదానంగా సొంత పార్టీపైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

దీంతో మోత్కుపల్లిని టీడీపీ దూరం పెట్టింది. ఆ తర్వాత మోత్కుపల్లి టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో చేరిన మోత్కుపల్లి పెద్దగా బయటకొచ్చి, రాజకీయాలు చేసిన సందర్భాలు కనిపించలేదు. ఈ క్రమంలోనే ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత మోత్కుపల్లి, కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా మోత్కుపల్లిని కాస్త దూరం పెట్టింది.

ఇక తాజాగా కేసీఆర్ దళితబంధు ప్రకటించిన నేపథ్యంలో మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. మరి మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరితే ఆయనకు ఏమైనా పదవి ఇస్తారా..? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలిసింది. మరి చూడాలి మోత్కుపల్లికి టీఆర్ఎస్‌లోనైనా పదవి వస్తుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news