హుజురాబాద్ ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టు చేపడుతోంది. దానికి తోడు జిల్లాలో పట్టున్న బలమైన బీసీ నేతలను గులాబీ గూటికి చేర్చుకుంటోంది. ఇప్పటికే టీటీడీపీ మాజీ అధ్యక్షులు ఎల్.రమణ, హుజురాబాద్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకుంది. వీరితో పాటు ఈటల రాజేందర్ చేరిక పట్ల బీజేపీలో అంసతృప్తిగా ఉన్న ఇనుగాల పెద్దిరెడ్డిని సైతం గులాబీ గూటిలోకి తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
అయితే, ఈటల చేరికపై పెద్దిరెడ్డి అంసతృప్తి చెందగా, ఆయన్ను విద్యాసాగర్ రావు సముదాయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసిన మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరిక ఖాయమనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇందుకు ఆయన సీఎం కేసీఆర్‌పై కురిపిస్తున్న ప్రశంసలే సాక్ష్యాలని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు దళిత సాధికారత సమావేశానికి మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పంపగా, ఆ మీటింగ్‌కు హాజరైన అనంతరం కేసీఆర్‌పై మోత్కుపల్లి ప్రశంసలు కురిపించడం గమనార్హం.
ఇప్పటికే హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. కాగా ఈటలకు కౌంటర్ అటాక్‌గా ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన మోత్కుపల్లినే టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా బరిలో దింపాలనే ఆలోచన టీఆర్ఎస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల అవినీతిపరుడని, దళితుల భూములను ఆయన ఆక్రమించుకున్నాడని ఈటల రాజేందర్‌పై మోత్కుపల్లి నర్సింహులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హుజురాబాద్ ఉపపోరు మొత్తంగా 2023 అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉండగా, అధికార టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనే విషయమై హుజురాబాద్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.