తెలంగాణలో అధికార గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని మొన్నటి వరకు ప్రకటించిన బీజేపీకి ప్రస్తుతం వరుస షాక్‌లు తగులుతున్నాయి. జిల్లా అధ్యక్షుల నుంచి మొదలుకుని సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు రాజీనామా బాట పడుతున్నారు. అందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. ఈ ఘటనలతో కమలం పార్టీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియమితులైన నాటి నుంచే తెలంగాణలో కొత్త ఆట మొదలైందని పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా, నియోజకవర్గాల వారిగా బలోపేతం చేసేందుకు గాను రేవంత్‌రెడ్డి పలు చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ నేతలతో సంప్రదింపులు చేస్తూ వారిని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కొక్కరి ఇళ్లలోకి వెళ్లి పార్టీ నిర్మాణం గురించి చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో జవసత్వాలు నింపేందుకు గాను తనవంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు రేవంత్. రేవంత్ పీసీసీ చీఫ్‌గా నియామకమైన నాటి నుంచి బీజేపీలోకి వలసల పర్వం ఆగిపోగా, వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఇది ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ విజయమేనని శ్రేణులు భావిస్తున్నాయి. కార్మిక సంఘాల నేతలు, సింగరేణి ఇతర ప్రాంతాల నేతలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని పాత నేతలనూ రేవంత్ కలుస్తూ వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులను కలిసారు రేవంత్. మొత్తంగా గులాబీ వర్సెస్ హస్తం అనేలా రేవంత్ దూకుడు చర్యలు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.