రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్టుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈటల రాజేందర్‌పై భూ కబ్జాఆరోపణలు వచ్చిన రోజు నుంచే ఆయన కనిపించకపోవడం ఇక్కడ గమనార్హం. ఇక వారం రోజుల మిస్సింగ్ మిస్టరీ తర్వాత ఆయన్ను ఏపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులోనే అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.
కానీ ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉండటమే ఆయనపై వేటు పడేందుకు కారణమైందని టీఆర్ ఎస్‌లో అంతర్గత చర్చ సాగుతోంది. ఇక ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న తర్వాత జిల్లాలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.
ఇక పుట్ట మధు అరెస్టుకు ముందే ఆయనతో సన్నిహితంగా ఉంటున్న పలువురు పెద్దపల్లి జిల్లా పోలీస్ బాస్‌లను కూడా బదిలీ చేశారు. వారి జాబితాను తయారు చేసి మరీ బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‌లను ఇప్పటికే బదిలీ చేయగా.. తాజాగా ముత్తారం ఎస్సై నరసింహారావు, రామగిరి ఎస్సై మహేందర్ ను బదిలీ చేస్తున్నట్లు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎప్పుడు ఎవరిమీద వేటు పడుతుందో అని ఇతర డిపార్టుమెంట్ల అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు.