మునుగోడు పోరు: ఎత్తుకు పై ఎత్తులు..!

ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారో అప్పటినుంచి..మునుగోడు ఉపఎన్నిక గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. తమ అధికార బలాన్ని అంతా ఉపయోగించి..ఈ సారి బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఉపఎన్నికల్లో నెగ్గి తీరాలని పనిచేస్తుంది. ఇప్పటికే మునుగోడులో కారు పార్టీ రాజకీయం మొదలైపోయింది. అలాగే అభ్యర్ధి ఎంపిక విషయంలో దూకుడుగా ఉంది.

ఇప్పటికే పలువురు పేర్లని పరిశీలిస్తుంది…కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఒకవేళ బీసీ నేతకు టిక్కెట్ ఇవ్వాలంటే…కర్నాటి ప్రభాకర్, నర్సయ్య గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్ధిని ఫిక్స్ చేయలేదు. అటు బీజేపీ మరోసారి ఉపఎన్నికలో సత్తా చాటాలని చూస్తుంది… రాష్ట్రంలో దూకుడుగా రాజకీయం చేస్తున్న బీజేపీ…రాజగోపాల్ రెడ్డిని ముందు పెట్టుకుని మునుగోడులో గెలవాలని భావిస్తుంది. ఇదే క్రమంలో మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు…ఎన్నికల టీంని కూడా రెడీ చేస్తుంది.

ఇక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ సీటు…ఆ సీటుని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా దూకుడుగా ముందుకెళుతుంది. రాజగోపాల్ పార్టీని వీడిన నేపథ్యంలో…అక్కడ కాంగ్రెస్ పార్టీ తరుపున బలమైన అభ్యర్ధిని పెట్టాలని చూస్తుంది. ఇప్పటికే మునుగోడులో కార్యకర్తలతో భారీ సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇక అభ్యర్ధి విషయానికొస్తే…ఇక్కడ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు స్రవంతికి సీటు ఇస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది.

కానీ తాజాగా మరో పేరు బయటకొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్టీ సీనియర్‌ నేత, రియల్టర్‌ చెలమల్ల కృష్ణారెడ్డిని పోటీకి పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బలంగా ఢీకొట్టే ఆర్ధిక, అంగ బలం కృష్ణారెడ్డికి ఉన్నాయి. ఇక మునుగొడులో బీఎస్పీ పార్టీ సైతం పోటీకి దిగనుంది…అలాగే ఇక్కడ పట్టున్న సి‌పి‌ఐ పార్టీ పోటీ చేస్తుందా? లేక ఏదైనా పార్టీకి మద్ధతు ఇస్తుందా? అనేది చూడాలి…మొత్తానికి మునుగోడు పోరు రసవత్తరంగా మారిపోయింది.