నల్గొండ హస్తంలో పోటీ.. ఆ సీట్లపై పట్టు.!

-

ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసి బి‌ఆర్‌ఎస్ సత్తా చాటింది. తర్వాత కాంగ్రెస్ గెలిచిన సీట్లు కూడా ఉపఎన్నికల్లో కోల్పోయింది. దీంతో నల్గొండ మొత్తం బి‌ఆర్‌ఎస్ చేతుల్లో ఉంది. అయితే ఈ సారి బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టి తమ కంచుకోటని తిరిగి కైవసం చేసుకోవాలనే ఊపులో కాంగ్రెస్ ఉంది. ఈ సారి నల్గొండలో ఆధిక్యం సాధించాలని ప్రయత్నాలు చేస్తుంది.

ఇదే క్రమంలో నల్గొండలో కాంగ్రెస్ సీట్ల కోసం పోటీ నెలకొంది. కొన్ని సీట్లలో ఎలాగో సీనియర్లు ఉన్నారు కాబట్టి..వారికి పెద్దగా పోటీ లేదు..కానీ కొన్ని సీట్లలో ఒకరిద్దరు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. మొదట సూర్యాపేట సీటు కోసం సీనియర్ నేత దామోదర్ రెడ్డి, అటు పటోళ్ళ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎవరికి వారు గట్టి పట్టుబడుతున్నారు. దీంతో సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది.

ఇక భువనగిరి టికెట్‌ను తనకే కేటాయించాలని పార్టీలోని సీనియర్‌ నేత కసిరెడ్డి నారాయణరెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు భువనగిరి బరిలో ఉండేందుకు పార్టీ నేతలు రామాంజనేయులుగౌడ్‌, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆలేరు సీటు కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదల నగేష్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి..ఇంకా పలువురు నేతలు పోటీ పడుతున్నారు.

మునుగోడు సీటు కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే సీన్ మారిపోతుంది. తుంగతుర్తి సీటులో అద్దంకి దయాకర్ ఉండగా, ఈయనకు పోటీగా మందుల శామ్యూల్ వచ్చారు. ఇలా నల్గొండలో సీట్ల కోసం కాంగ్రెస్ లో పోటీ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news