చంద్రబాబుకు బాధ్యత లేదా… స్వార్ధం మాత్రమే ఉందా?

-

ఈ లోకంలో ప్రతిమనిషికీ స్వార్ధం ఉంటుంది కానీ… అంతకు మించి కాకపోయినా ఎంతోకొంత బాధ్యత కూడా ఉండాలి! పైగా రాజకీయ నాయకులకు.. ప్రజలే మాదేవుళ్లు అనే నాయకులకూ మరీ ఉండాలి. ఈ విషయం మరిచిన బాబు… టీడీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది! కానీ… అచ్చెన్న అరెస్టును బాబు పూర్తిస్థాయి రాజకీయ కోణంలో చూడటం మొదలుపెట్టారు. అయినా పర్లేదు అది ఆయన ఇష్టం! కానీ… ప్రజల ఆరోగ్యం తో ఆట్లాడుకోవాలని ఆలోచిస్తే ఎలా?

అచ్చెన్నాయుడు అరెస్టు అనంతరం.. కులం కార్డు తీశారు చంద్రబాబు. బీసీలంతా రోడ్డెక్కాలని పిలుపునిచ్చారు. ఇదేమి చోధ్యంరా బాబు అనుకున్నారో ఏమో కానీ… అటువైపునుంచి అంతకా రెస్పాన్స్ రాలేదు. అనంతరం టీడీపీ శ్రేణులంతా రోడ్లెక్కాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సమయంలో చింతమనేని లాంటి వారు కొందరు బాధ్యతారాహిత్యంతో రోడ్లపైకి వచ్చారు… వారిని కరోనా పేరు చెప్పి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేశారని కాదు కానీ… ప్రజా నాయకులమని చెప్పుకునే ఈ నేతలకు ప్రజారోగ్యంపై శ్రద్ధ, బాధ్యతా ఉండనక్కరలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ క్రమంలో మరికొందరి నాయకుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా హాజరైన వారంతా కరోనా సంగతే మరిచారు. ఒక్కరూ మాస్క్ ధరించలేదు.. శానిటైజర్ వాడలేదు.. భౌతిక దూరం అనేమాటే లేదు.. సామూహిక కార్యక్రమాలపై నిషేధం ఉందనే విషయం మరచిపోయి వందల సంఖ్యలో ఒకేచోట కలిసి ఉన్నారు. ఆ సమయంలో ఆందోళనలు చేస్తున్న వారిలో ఎవరికైనా ఒకరికి వైరస్ ఉంటే?

ఇది పద్దతి కాదేమో బాబు అంటూ యువత ఆన్ లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారు! నిన్నమొన్నటివరకూ కరోనా గురించి, భౌతికదూరం గురించి ఆన్ లైన్ వేదికగ తెగ మాట్లాడిన బాబు.. మహానాడుకోసం అమరావతికి వచ్చే మార్గంలో ఇలాంటి పనులే చేశారు. మళ్లీ బాధ్యత మరిచి.. నేనే చేశాను, మీరు చేస్తే తప్పా.. మీరూ చేయండి అన్న చందంగా.. శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మరీ ఇంత బాధ్యతా రాహిత్యమా? తమ స్వార్ధ రాజకీయాలకోసం, రాజకీయ మనుగడల కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news