వేటు పడగానే ఆ నేత బీజేపీ కండువా కప్పేసుకుంటారా?

-

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో టీఎంయూకు కాలం చెల్లిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇటీవల యూనియన్‌లో.. ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు కొత్త యూనియన్ ఆవిర్భావానికి దారి తీసేలా ఉన్నాయి. ఇదే సమయంలో టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిని సర్వీసు నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ యాజమాన్యం నోటీసులు ఇవ్వడం ఆ హీట్‌ను మరింత పెంచింది.అశ్వత్థామరెడ్డికి చెక్‌ పెట్టేందుకు రంగం సిద్దమవ్వడంతో వేటు పడగానే కమలం గూటికి చేరేందుకు ఆయన సిద్దంగా ఉన్నారా అన్నదాని పై ఇప్పుడు ఆర్టీసీ యూనియన్ లో చర్చ నడుస్తుంది.

వివరణ ఇచ్చేందుకు అశ్వత్థామకు వారం రోజులు గడువిచ్చింది ఆర్టీసీ. ఇది చివరి ఛాన్స్‌. ఇందుకు సంబంధించిన నోటీసులను బస్‌ భవన్‌తోపాటు.. అశ్వాత్థామరెడ్డి పనిచేసే ఎంజీబీఎస్ నోటీస్‌ బోర్డులోనూ ప్రదర్శించారు. పేరుకు షోకాజ్ నోటీసే అయినా.. సర్వీసు నుంచి అశ్వత్థామరెడ్డిని తొలగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికితోడు ఆయన బీజేపీతో అంటకాగడంపై అధికారపార్టీ గుర్రుగా ఉందట. ఇప్పటికే టీఎంయూలో మరో నాయకత్వం తెర మీదకు వచ్చింది. కార్మిక సమస్యల పరిష్కారం పేరుతో మంత్రులను, ఉన్నతాధికారులతోపాటు ఎమ్మెల్సీ కవితను కూడా కలిసి వినతిపత్రాలు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటోంది.

ఈ పరిణామాలే చూపిస్తూ అశ్వత్థామరెడ్డి విషయంలో జరుగుతున్న విషయాలకు లింక్‌ పెడుతున్నారు.
అయితే అశ్వత్థామరెడ్డి కూడా యాజమాన్యం ఎప్పుడు వేటు చేస్తే అప్పుడు అన్ని జిల్లాలు తిరిగి కార్మికులను ఏకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తే.. ప్రభుత్వం కక్ష్య కట్టి తనను ఉద్యోగం నుంచి తొలగించిందని చెప్పేందుకు బలం చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్ల మనుగడ కష్టంగా మారి నాయకులు పునరాలోచనలో పడ్డారు.

యూనియన్ కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్మికుల నుంచి వసూలు చేసిన చందాల వివరాలకు లెక్కలు లేవట. కోటిన్నరకు పైగా నిధులు..ఇతరత్రా విషయాలపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు టీఎంయూలోని మరోవర్గం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో అశ్వత్థామరెడ్డిని కార్నర్‌ చేస్తారని అనుకుంటున్నారు. అశ్వత్థామరెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో బీజేపీతో ఆయనకు అనుబంధం ఉందని.. ఇప్పుడు ఉద్యోగం నుంచి తొలిగిస్తే కాషాయ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news