శ్రీకాకుళం జిల్లా పలాస(palasa) నియోజకవర్గంలో టీడీపీ జగడాలు జోరందుకున్నాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ రాజకీయ నేత గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీషకు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. కింజరాపు అచ్చన్నాయుడు కుటుంబం ఎసరు పెడుతోందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కింజరాపు కుటుంబం నుంచి మరో నేత రంగంలోకి దిగుతున్నారని.. కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీకి బలం ఉన్న పలాస నియోజకవర్గంపై ఈ వర్గం కన్నేసిందని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా కింజరాపు కుటుంబానికి పలాస నియోజకవర్గంతోనూ అనుబంధం ఉంది. ఈ క్రమంలో టీడీపీని ఇక్కడ తామే బలోపేతం చేశామని.. కానీ, ఇటీవల కాలంలో సరైన నాయకత్వం లేని కారణంగా.. పార్టీ దెబ్బతింటోందని.. కింజరాపు కుటుంబం.. ఎప్పుడు అవకాశం వచ్చినా.. విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పైగా శిరీష నాయకత్వంపైనా ఫిర్యాదులు చేసినట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మాట దూకుడు కారణంగా ఆమె పార్టీని నాశనం చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి నాయకత్వాన్ని మార్చాలని కింజరాపు కుటుంబం పట్టుబడుతున్నట్టు టీడీపీ సీనియర్లు చెబుతున్నారు.
గతంలో గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ కూడా ఇలానే దూకుడుగా వ్యవహరించి.. పార్టీని భ్రష్టు పట్టించారని.. ఆ కుటుంబం వల్ల టీడీపీకి ఒరిగింది ఏంటని.. ఇక్కడ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం.. కింజరాపు కుటుంబం పలాసను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునే పరిస్తితిలో ఉన్న మంత్రి సీదిరి అప్పలరాజుకు అడ్డుకట్టవేయాలంటే.. శిరీష వల్ల సాధ్యం కాదని.. ఆమెను పార్టీకి పరిమితం చేసి.. నియోజకవర్గం బాధ్యతలను తమకు ఇచ్చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టు సమచారం.
ఇక, నియోజకవర్గంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇటీవల కాలంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఆయా పర్యటనలకు శిరీషకు ఆహ్వానం అందకపోవడాన్ని బట్టి.. కింజరాపు ఫ్యామిలీ ఇక, పలాసను దక్కించుకున్నట్టేనని.. శివాజీని పూర్తిగా పక్కన పెట్టసినట్టేనని సీనియర్లు సైతం చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై చంద్రబాబు తనకు తెలిసినా.. మౌనంగా ఉంటున్నారని.. తాను పార్టీలో యువ నాయకురాలిగా పోరాటం చేస్తున్నానని.. తనకు కలిసి వస్తే.. పార్టీని బలోపేతం చేస్తానని.. శిరీష తన అనుచరుల వద్ద వాపోతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.