అవును మీరు చూస్తున్నది నిజమే. ఏపీ డిప్యూటీ సీఎం సినీనటిగా మారిపోయారు. మీరు షాక్ అవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏపీలో ఇద్దరు మహిళా డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరిలో హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పశ్రీవాణి సైతం డిప్యూటీ సీఎంలుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పుష్పశ్రీవాణి ఇప్పుడు సినీనటి అవతారం ఎత్తారు. మరి ఆమె ఎందుకు ఇలా మారారో ? ఆ కథేంటో చూద్దాం.
ప్రస్తుతం వ్యవసాయం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెఫ్ట్‌కు ప్రాధాన్యత ఎక్కువవుతోంది. ఈ ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను ప్రజలకు తెలిపేందుకు అమృతభూమి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో జరుగుతోంది.
లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఉపాధ్యాయురాలి పాత్ర పోషించారు. అక్కడ గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో డిప్యూటీ సీఎం నటించిన సన్నివేశాలను చిత్ర బృందం షూట్ చేసింది. ఆ సీన్లోనే కలెక్టర్ హరి జవహర్‌లాల్ సైతం నటించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా, దాని ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ సినిమా తెరకెక్కడం గొప్ప విషయమని కొనియాడారు.
ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరమని… మంచి సందేశంతో కూడిన ఈ సినిమాను ఎంకరేజ్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా యూనిట్‌ను కొనియాడారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచడానికే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. పాలిటిక్స్‌లో ఫుల్ టైం బిజీగా ఉండే శ్రీవాణి ఇలా సందేశాత్మక సినిమాల్లో నటిస్తుండడంతో పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.