అక్కడ పవన్..ఇక్కడ కవిత..సీటు పై రచ్చ?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు పోటీ చేసే సీట్లపై పెద్ద చర్చే నడుస్తుంది.  చాలామంది కీలక నేతలకు తమకు ముందు నుంచి పోటీ చేసే సీట్లు ఫిక్స్ అయిపోయాయి. కానీ కొందరికి మాత్రం సీట్లు ఫిక్స్ కాలేదు. దీంతో వారు పోటీ చేసే సీట్లపై పెద్ద చర్చ జరుగుతుంది. అటు ఏపీలో జనసేన అధినేత పవన్, ఇటు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ నాయకురాలు కవిత సీటుపై రకరకాల కథనాలు వస్తున్నాయి.

అయితే కీలక నేతలైన కే‌సి‌ఆర్‌ గజ్వేల్‌లో, చంద్రబాబు కుప్పంలో, జగన్ పులివెందులలో, హరీష్ రావు సిద్ధిపేట, కే‌టి‌ఆర్ సిరిసిల్ల, రేవంత్ రెడ్డి కొడంగల్, లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం ఖాయమే. కానీ పవన్, కవిత సీట్ల విషయంలో గత నాలుగేళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి వారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారని చర్చ నడుస్తుంది. అదే సమయంలో ఫలానా సీటులో పోటీ చేయవచ్చు అని కథనాలు వస్తున్నాయి.

అసలు పవన్ పోటీ చేసే సీట్లపై ఎన్ని రకాల ఊహాగానాలు వచ్చాయో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటికీ ఆయన పోటీ చేసే సీటు ఏంటి అనేది తేలలేదు. అనేక సీట్లు మాత్రం చర్చకు వచ్చాయి. గత ఎన్నికల్లో ఓడిన గాజువాక, భీమవరంలతో పాటు పిఠాపురం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం, తిరుపతి ఇలా రకరకాల సీట్లు తెరపైకి వచ్చాయి. కానీ ఓడిన చోటే గెలవాలని చూస్తున్నారు. అది కూడా ఒక సీటులోనే..దాదాపు భీమవరంలోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది.

అటు గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఈ సారి ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో జగిత్యాల, ముషీరాబాద్, నిజామాబాద్ అర్బన్ ఇలా రకరకాల సీట్లపై చర్చ నడిచింది. కానీ ఆమె మాత్రం ఓడిన నిజామాబాద్ ఎంపీ సీటులోనే నిలబడి మళ్ళీ గెలవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి చివరికి పవన్, కవిత ఎక్కడ పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news