తిరుపతి లోక్‌సభ సీటు పవన్‌ కోరడం వెనక లెక్కలు వేరే ఉన్నాయా !

-

తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికపై జనసేన ఫోకస్‌ పెట్టింది. బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతోంది మరి.. మిత్రపక్షం బీజేపీ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా? ఇప్పటికే తిరుపతిలో సమర సన్నాహాలు మొదలుపెట్టిన కమలనాథులు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా అసలు తిరుపతి లోక్‌సభ సీటు పవన్‌ కోరడం వెనక ఉన్న లెక్కల పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే నడుస్తుంది.

తెలంగాణతోపాటు ఏపీలోనూ క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికే ఈ సెగలకు కారణం. ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అభ్యర్ధిని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది అధికార వైసీపీ. అభ్యర్థి దాదాపుగా ఫైనల్‌ అయినట్టు టాక్‌. సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ అకాల మరణంతో జరగబోయే ఈ ఉపఎన్నికలో వైసీపీ, టీడీపీ ఎత్తులు అలా ఉంటే.. ఇక్కడ బలం చాటి ఏపీలో బలపడాలన్నది బీజేపీ వ్యూహం. ఇప్పటికే తిరుపతి వేదికగా సమర సన్నాహాలు మొదలుపెట్టేశారు కమలనాథులు.

బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉండటంతో 2019 ఎన్నికల కంటే కాస్త మెరుగైన ఫలితం వస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. కానీ… తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో జనసేన ఉందన్న ప్రచారం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కొందరైతే తిరుపతికి, గ్రేటర్ ఎన్నికలకు ముడిపెట్టి రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి భేషరతుగా మద్దతు ప్రకటించారు పవన్. గ్రేటర్ బరి నుంచి బీజేపీ చెప్పడం వల్ల తప్పుకొన్నందున.. తిరుపతి లోక్‌సభ సీటును తమకు వదిలేయాలని పవన్‌ కల్యాణ్‌ బీజేపీ పెద్దలను కోరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తిరుపతి లోక్‌సభ సీటును జనసేనకు ఇవ్వాలని పవన్‌ కోరడం వెనక పెద్ద కథే ఉందట. గతంలో పీఆర్పీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలిచారు. పైగా ఈ ప్రాంతంలో కాపు, బలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తిరుపతి, గూడురు, సర్వేపల్లి పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జనసేన అభ్యర్ధిని పోటీకి పెడితే.. దానికి బీజేపీ మద్దతు ఇస్తే ఆశించిన ఫలితం రావొచ్చన్నది జనసైనికుల లెక్కగా తెలుస్తోంది. 2019లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతిలో జనసేన పోటీ చేయలేదు. BSPకి మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో BSPకి 20 వేల ఓట్లు వచ్చాయి. బీజేపీకి 16 ఓట్ల వేట్లు వచ్చాయి.

ఒకవేళ జనసేన పోటీ చేస్తే.. మద్దతుగా బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎంత మంది వచ్చి ప్రచారం చేస్తారన్నది అనుమానమే. పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ప్రధాన ఆకర్షణగా మారతారు. పైగా జనసేనాని ప్రతిపాదనకు బీజేపీ ఓకే చెప్పడం అనమానమే అని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు పలు దఫాలుగా తిరుపతిలో సమర సన్నాహక సమావేశాలు పెట్టారు. పైగా తిరుపతి పుణ్యక్షేత్రం. తమ పోరాటం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలుపెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడానికి వారు అంగీకరించకపోవచ్చు.

బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి ప్రచారం చేసే వీలుంది. అప్పుడు ఎన్నికల వేడి ఓ రేంజ్‌లో ఉంటుంది. వీరికి జనసేన మద్దతిస్తే అది అదనపు బలం అవుతుందని అభిప్రాయపడుతున్నారట. మరి.. జనసేనాని వ్యూహం ఫలిస్తుందో.. బీజేపీ మాటే మళ్లీ నెగ్గుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news